విపక్షాలు ఏమైనా విమ‌ర్శించ‌వ‌చ్చుగానీ, భార‌త రాజ‌కీయాల్లో న‌రేంద్ర మోదీది ఒక ప్ర‌త్యేక శ‌కం. రెండున్న‌ర దశాబ్దాల సంకీర్ణ రాజ‌కీయాల‌కు ముగింపు ప‌లికిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. ఇది విప‌క్షాలు సైతం అంగీక‌రించే వాస్త‌వం. ఇప్ప‌టికే దేశంలో అత్య‌ధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెసేత‌ర ప్ర‌ధాని ఖ్యాతిని త‌న సొంతం చేసుకున్న మోదీని స‌మీప భ‌విష్య‌త్తులో దీటుగా ఢీకొట్ట‌గ‌లిగే నాయ‌కుడు దేశంలో ఎవ‌రైనా ఉన్నారా అని ప్ర‌శ్నిస్తే ఎవ‌రైనా త‌డుముకోవాల్సిందే. అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్వ‌హించిన ఒక‌ స‌ర్వేలో గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా మోదీ  నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ స‌ర్వేలో మెక్సికో ప్ర‌ధాని లాపెజ్ ఆబ్రెడార్ రెండో స్థానంలో నిల‌వ‌గా, ఇట‌లీ నేత డ్రాగీ మూడో స్థానంలో నిలిచారు. అగ్ర‌రాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ జాబితాలో 6వ స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఇక దేశీయంగా నిర్వ‌హించిన తాజా సర్వేల్లోనూ మోదీకి ప్ర‌ధానిగా ఇప్ప‌టికీ 60 శాతానికి పైగా ప్ర‌జామోదంతో కొన‌సాగుతున్నార‌ని, ఆ త‌రువాత స్థానంలో 15 శాతం మంది బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని వెల్ల‌డైంది.

 ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నుంచి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా కావ‌చ్చ‌ని ప్ర‌చారంలో ఉన్న రాహుల్ గాంధీ కేవ‌లం సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. సుదీర్ఘ‌కాలం దేశ రాజ‌కీయాల‌ను శాసించిన నెహ్రూ కుటుంబ వార‌సులకు ఇంత త‌క్కువ ప్ర‌జాద‌ర‌ణ క‌నిపించ‌డం ఇదే ప్ర‌థ‌మం. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని ప‌ద‌విలో ఏడున్న‌రేళ్ల త‌రువాత కూడా అధికార పార్టీపై ఉండే ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించి మోదీ ప్ర‌భ వెలుగుతుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌రం. అంతేకాదు ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే మ‌రోసారి బీజేపీ 270 కిపైగా స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని, కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని మ‌రో స‌ర్వే తేల్చింది. అయితే ఇది కేవ‌లం మోదీ ప్ర‌చార ఆర్భాట‌మేన‌ని, అనుకూల మీడియాతో విపక్షాల మ‌నోస్థైర్యాన్ని దెబ్బ‌తీసే మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. మీడియాను మోదీ ప్ర‌భావ‌వంతంగా వినియోగించుకోవ‌డం వ‌ర‌కు వీరి వాద‌న‌లో నిజం ఉండ‌వ‌చ్చునేమో గానీ మిగిలిన ఆరోప‌ణ‌లు వాస్త‌వం కాదనే చెప్పాలి.


మ‌రి మోదీ బ‌లం ఎక్క‌డ ఉందీ అంటే విప‌క్షాల అనైక్య‌త‌లో ఉంది. వారిని ఏక‌తాటిపైకి రాకుండా చేయ‌గ‌లిగే గుజ‌రాతీ ద్వ‌యం రాజ‌కీయ చాణక్యంలో ఉంది. అవును ఇది నిజం. యూపీలో మాయావ‌తి, అఖిలేష్ క‌లిస్తే బీజేపీ ఆట క‌ట్టించ‌వ‌చ్చు. కానీ అది జ‌ర‌గ‌దు. మాయావ‌తి కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టినా ఆ రాష్ట్రంలో మెరుగైన ఫ‌లితాలు తెచ్చుకోవ‌చ్చు. కానీ అదీ సాధ్యం కాదు. ఎందుకంటే అవినీతి కేసుల భ‌యం. ప‌లు రాష్ట్రాల్లో బీజేపీ బ‌లం, ప్ర‌తిప‌క్షాల బ‌ల‌హీన‌త అదే. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మోదీకి దీటైన నాయ‌కుడు లేక‌పోవ‌డం మోదీకి క‌లిసొచ్చిన అదృష్టం. నిజానికి ఐదు ప‌దుల వ‌య‌సు దాటిన రాహుల్ గాంధీ ఇప్ప‌టికీ జాతీయ స్థాయి ఆమోదం పొంద‌లేక‌పోవ‌డం స్వ‌యంకృతం. లోక్ స‌భ‌లో గ‌తంలో మోదీ ప్ర‌భుత్వ విధానాల‌ను తూర్పార‌బ‌ట్టి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడ‌నుకున్న‌ కొద్ది నిముషాల్లోనే మోదీ సీటు వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న‌ను హ‌త్తుకుని వ‌చ్చి, స‌హ‌చ‌రుల‌కు క‌న్ను గీట‌డం రాహుల్ అప‌రిప‌క్వ‌త‌కు నిద‌ర్శ‌నం. ఏడు ప‌దులు దాటిన మోదీ దూకుడు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరైతే, ఆయ‌న‌కంటే చాలా చిన్న‌వాడైన రాహుల్ మాత్రం సంప్ర‌దాయ రాజ‌కీయాల‌నే చేస్తుండ‌టం కార‌ణంగానే కాంగ్రెస్ పార్టీ అంత‌కంత‌కూ బ‌ల‌హీన‌ప‌డుతుంద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. ఇక బీజేపీ మ‌త‌తత్వ అజెండాను ఎప్పుడూ దాచుకోలేదు. దానిని మ‌రింత బ‌లంగా ముందుకు తీసుకెళ్ల‌డంలో మోదీ అనుస‌రిస్తున్న వైఖ‌రి.. లౌకిక‌, ప్ర‌జాస్వామ్య వాదుల‌కు కొరుకుడుప‌డ‌క‌పోవ‌చ్చునేమో గానీ బీజేపీ అప్ర‌తిహ‌త విజ‌యాల‌కు ప్ర‌ధాన కార‌ణంగా నిలుస్తుంద‌నేదీ కాద‌న‌లేని స‌త్యం. ఈ ప‌రిస్థితుల్లో దేశంలో మోదీకి ఎదురు నిల‌వ‌గ‌లిగే నాయ‌కుడెవ‌ర‌న్న‌ది బ‌హుశా కాల‌మే నిర్ణ‌యించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: