
తాజాగా వైసీపీ కార్యకర్తలు ఫోర్జరీ పోస్టులతో అరాచకం సృష్టిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ నేతల సోషల్ మీడియా ఖాతాలను ఫోర్జరీ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సి.ఐ.డి అదనపు డి.జి.పికి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దురుద్దేశంతో రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని వైసీపీ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.
ప్రత్యేకించి టీడీపీ సభ్యుల్లో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ హ్యాకర్లు తన సోషల్ మీడియా ఖాతాను ఫోర్జరీ చేశారని వర్ల రామయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూశారని వర్ల రామయ్య దుయ్యబట్టారు. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖాతాను ఫోర్జరీ చేసి ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్ట్ పెట్టారని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
జోన్స్ పణితి అనే వ్యక్తి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లెటర్హెడ్తోపాటు ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని వర్ల రామయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకంతో ఉన్న లెటర్ హెడ్ తో లేఖలు రాస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వర్ల రామయ్య ఆరోపిచారు. అయితే ఇలాంటివి టీడీపీ మాత్రం చేయడం లేదని చెప్పలేం.. అన్ని పార్టీలు అలాగే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.