కడుపుబ్బరంగా వున్నప్పుడు చాలా అంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది.అయితే కడుపు ఉబ్బరం సమస్య తలెత్తడానికి మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. వీటితోపాటు మనం తరచూ తినే ఆహార పదార్థాలు కూడా బ్లోటింగ్ సమస్యకు దారితీస్తాయి.కడుపుబ్బరం నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలు కొంతవరకు ఉపయోగిస్తాయి. కడుపుబ్బరానికి ప్రధాన కారణమైన మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే రోజూ 20 నిమిషాల పాటు ఎప్సమ్‌ సాల్ట్ బాత్‌ చేయడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.కడుపుబ్బరం సమస్యతో బాధపడుతున్న మహిళలు భోజనానికి ముందు (లంచ్‌, డిన్నర్ సమయాల్లో).. ఒక అరటిపండు తినడం వల్ల సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం పొందచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఇలా రెండు నెలల పాటు ప్రయత్నిస్తే సమస్య సగానికి సగం తగ్గుతుందట.స్మూతీస్‌, పండ్ల రసాలు తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించకుండా.. నేరుగా గ్లాస్‌తోనే తాగడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా గాలి కడుపులోకి చేరకుండా ఉబ్బరం రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.


కొంతమంది పాస్తా, వైట్ బ్రెడ్ వంటివి తీసుకున్నప్పుడు కూడా కడుపుబ్బరానికి గురవుతుంటారు. కాబట్టి ఈ పదార్థాల్ని మితంగా తీసుకోవడం మంచిది.కొన్ని రకాల శీతల పానీయాలు తాగినప్పుడు కూడా కడుపు ఉబ్బరానికి గురవుతుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ తాగాలనిపిస్తే మితంగా తీసుకోవాలి.శరీరంలో సోడియం స్థాయులు పెరిగినా, డీహైడ్రేషన్‌కి గురైనా, టీ-కాఫీలు ఎక్కువగా తాగినా కడుపుబ్బరం బారిన పడే అవకాశాలెక్కువ. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం (గోరువెచ్చటి నీళ్లైతే ఇంకా మంచిది), వంటకాల్లో ఉప్పు తగ్గించడం మంచిదంటున్నారు నిపుణులు.తక్కువ ఆహారం ఎక్కువసార్లు తినడం వల్ల కడుపుబ్బరం రాకుండా జాగ్రత్తపడచ్చు.ఇక ఈ సమస్య ఎప్పుడో ఒకసారి కాకుండా పదే పదే తలెత్తితే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే అందువల్ల ఇతర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తప్పుతుందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: