
కలల స్వర్గం అంటూ మలేసియాలో విలాస సౌకర్యాలతో నిర్మించిన నగరం ఇప్పుడు ఘెస్ట్ సిటీగా మారింది. దక్షిణ మలేసియాలోని జోహోర్ నగరానికి సమీపంలో 100 బిలియన్ డాలర్లతో చైనా రియల్ ఎస్టేట్ డెవలపర్ కంట్రీ గార్డెన్ సంస్థ మొదలు పెట్టిన ఈ గార్డెన్ సిటీలో 10 లక్షల మంది నివసించేందుకు వీలుగా అన్ని సదుపాయాలతో వేలకొద్దీ అపార్ట్ మెంట్ లను నిర్మించారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా కంట్రీ గార్డెన్ చేపట్టిన ఈ ఫారెస్ట్ సిటీ 2016లో రూపుదిద్దుకున్నా.. ఇప్పటి వరకు మొత్తం 15 శాతం మాత్రమే పూర్తయింది. కానీ ప్రజాధారణ మాత్రం లేదు. దాదాపు 1 శాతం కన్నా తక్కువ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.
ఎన్నో అంచనాల మధ్య మొదలైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు అనే పరిస్థితికి వచ్చింది. మలేసియాలో అన్ని సౌకర్యాలు అంటే గోల్ఫ్ కోర్స్ వాటర్ పార్క్, బార్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు అన్నీ ఒక చోట ఉండేలా పర్యావరణ హితంగా నగరాన్ని నిర్మించేందుకు కంట్రీ గార్డెన్ ముందుకు వచ్చింది. చైనాలో రియల్ ఎస్టేట్ మందగించిన నేపథ్యంలో 200 బిలియన్ డాలర్ల మేర అప్పులు కూరుకుపోయిన కంట్రీ గార్డెన్ సంస్థ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామనే నమ్మకంతో ఉంది. భూతల స్వర్గం అంటూ ప్రచారం చేస్తే ఇక్కడ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఉండాలంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది అందుకే ఖాళీ చేశా అని అక్కడ అపార్ట్ మెంట్ తీసుకున్న ఓ మహిళ చెప్పింది. అక్కడున్న వారందరూ దీనిని ఘోస్ట్ సిటీగా పిలుస్తున్నారు.