అతనిలో కళా పిపాస అధికం. పైగా నటనాభినివేశం కూడా ఉంది. అందుకే యువకుడిగా ఉన్నపుడు మద్రాస్ రైలెక్కి చిత్ర సీమలో తన స్థానం చూసుకుందామని వచ్చాడు. ముఖానికి రంగేసుకుని మంచి నటుడు కావాలని తాపత్రయపడ్డాడు. కానీ విధి విచిత్రమేంటో కానీ ఆయనకు నటుడిగా సినీ సీమ పెద్ద స్కోప్ ఇవ్వలేదు కానీ అద్భుతమైన నిర్మాతగా మాత్రం మార్చేసింది.

ఆయనే శంకరాభరణం, సాగరసంగమం వంటి గొప్ప కళాఖండాల సృష్టి కర్త ఏడిద నాగేశ్వరరావు. ఆయన‌  నటుడిగా తన లక్ చూసుకోవడానికి 60 దశకం చివరలో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు. అయితే అనుకున్న విధంగా ఆయన నటన పధం సాగలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వేళ ఆయనకు ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాధ్ తో పరిచయం ఏర్పడడం అలా ఆయన తీసిన సిరిసిరి మువ్వ  సినిమాలో తానూ కొంత భాగస్వామి గా  కావడంతో అడుగులు నిర్మాత వైపుగా పడ్డాయి. ఆ తరువాత తాయారమ్మ బంగారయ్య సినిమాను ఆయన తీస్తే సూపర్ హిట్ అయింది. అందులో అతిధి నటుడు పాత్రను చిరంజీవి పోషించారు కూడా.

ఇక ఆయన 1979లో దర్శకుడు కె విశ్వనాధ్ డైరెక్షన్ లో పూర్ణోదయ క్రియేషన్ బ్యానర్ మీద  తీసిన శంకరాభరణం కళాఖండంగా చరిత్రకి ఎక్కింది. అప్పట్లో ఈ సినిమాను చూసిన వారు కూడా గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఖండాంతరాలకు ఈ కీర్తి పాకింది. మలీశ్వరి తరువాత తెలుగు జాతికి అందిన మరో అద్భుత చిత్రం అని కూడా కొనియాడారు. ఆ తరువాత   కమల్ విశ్వనాధ్ లతోనే సాగర సంగమం తీస్తే బంపర్ హిట్. ఇది కూడా కళాఖండమే. ఇక అదే కమల్ విశ్వనాధ్ లతో తీసిన స్వాతిముత్యం కూడా అద్భుత చిత్రంగా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవితో విశ్వనాధ్ డైరెక్షన్ లో  తీసిన స్వయంకృషి మూవీ స్పూర్తిదాయకమైన చిత్రంగా నిలిచింది. మొత్తానికి ఏడిద నాగేశ్వరరావు నటుడిగా స్థిరపడి ఉండి  ఉంటే కొన్ని సినిమాలలో మాత్రమే అలరించే వారు. కానీ నిర్మాత కావడంతో తెలుగు జాతి కీర్తి పతాకను శాశ్వతంగా ఎగరేసి అందరి గర్వం పెంచేలా చేసి చిరకీర్తిని ఆర్జించారు అని చెప్పాలి. 1934 ఏప్రిల్ 24న పుట్టిన ఏడిద 2015లో మరణించారు. పుట్టిన రోజు వేళ ఆయనను స్మరించుకోవడం తెలుగు వారికి ఆనందకరం.



 

మరింత సమాచారం తెలుసుకోండి: