దొంగలున్నారు జాగ్రత్త’.. ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. కానీ ఎవరికీ తెలియకుండానే అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. స్టార్స్ లేకపోవడం, ప్రమోషన్స్ లాంటివి చేయకపోవడం..
దీనికి మెయిన్ రీజన్స్. ఇవన్నీ పక్కనబెడితే బిగ్ స్క్రీన్ పై విడుదలైన సరిగ్గా రెండంటే రెండు వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. దీంతో థియేటర్స్ లో మిస్సయిన వారు… మొబైల్ లేదా టీవీలో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. థ్రిల్ కి గురవుతున్నారు. ఇంతకీ ఈ సినిమా కథేంటి.. ఎందుకు బాగుంది లాంటి విషయాలు తెలుసుకుందామా!?

కథ:

స్టోరీ చెప్పాలంటే చాలా సింపుల్. రాజు అనే చిన్న దొంగ. పార్క్ చేసిన కార్లలో ఉండే ల్యాప్ ట్యాప్, హ్యాండ్ బ్యాగ్ లాంటి వస్తువుల్ని దొంగిలిస్తుంటాడు. ఓ రోజు కూడా అలానే తనకు ఓ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో ఓ కారులో దొంగతనం చేయడానికి వెళ్తాడు కాకపోతే అదే కారులో ఇరుక్కుపోతాడు. బయటకు రావాలని ఎంత ప్రయత్నించినా సరే కుదరదు. పోనీ బయట కనిపిస్తున్న ఎవరినైనా సరే పిలుద్దామంటే వీలుపడదు. ఫోన్ లో ఛార్జింగ్ ఉండదు. తాగడానికి నీరుండదు. కారులో స్క్రీన్ ద్వారా ఓ డాక్టర్ మాత్రమే.. రాజుతో మాట్లాడుతుంటాడు. ఇంతకీ ఆ కారు ఎవరిది? ఆ డాక్టర్ ఎవరు? రాజు ఫైనల్ గా బతికి బయటపడ్డాడా లేదా అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి.

విశ్లేషణ:

తెలుగు సినిమా చాలా మారిపోయింది. ఎంతలా అంటే ఒకప్పుడు మూస ధోరణిలో మాత్రమే ఎక్కువగా సినిమాలు వచ్చేవి. ఒకవేళ కొత్త తరహా ప్రయత్నాలు చేసినా సరే ప్రేక్షకుల నుంచి ఆశించినంత రియాక్షన్ ఉండేది కాదు. కాకపోతే గత కొన్నేళ్లలో ట్రెండ్ మారింది. యంగ్ డైరెక్టర్స్.. డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలు తీస్తున్నారు. వాటికి జనాలు నుంచి రెస్పాన్స్ కూడా అలానే వస్తుంది. సినిమా చిన్నదా పెద్దదా అని చూడటం లేదు. కంటెంట్ బాగుందంటే చాలు అక్కున చేర్చుకుంటున్నారు. థియేటర్లలో కుదరకపోతే, ఓటీటీలో వచ్చిన తర్వాత అయినా సరే ఆదరిస్తున్నారు. అలాంటి ఓ సినిమానే ‘దొంగలున్నారు జాగ్రత్త’.

ఇకపోతే ఈ సినిమా ‘4×4’అనే స్పానిష్ సినిమాకు అఫీషియల్ తెలుగు రీమేక్. ఒరిజినల్ ని పెద్దగా మార్పులేం చేయకుండా తెలుగులోనూ తీశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా లీడ్ రోల్ చేశాడు. ‘మత్తు వదలరా’, ‘తెల్లవారితే గురువారం’ సినిమాలు చేసి కాస్తోకూస్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అద్భుతమని చెప్పలేం గానీ కథకు తగ్గ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కథంతా కారులోనే ఉంటుంది. దాదాపు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లోజప్ షాట్సే ఎక్కువగా ఉంటాయి. దీంతో శ్రీసింహాకి యాక్టింగ్ లో పెద్దగా అనుభవం లేకపోవడం కొన్ని సీన్స్ లో కనిపిస్తుంది. అది తప్పించి చాలా బాగా నటించాడు. కారులో చిక్కుకుపోయిన తర్వాత తాగడానికి నీరు ఉండదు. ఒకానొక సందర్భంలో బాగా దాహం వేస్తుంది. అలాంటి టైమ్ లో ఏం చేయాలో తెలీక.. తన యూరిన్ ని వాటర్ బాటిల్ లో పట్టి, మళ్లీ తనే తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సీన్ చూడటానికి చాలా నార్మల్ గా ఉన్నప్పటికీ.. చూస్తున్న వారి ఒళ్లు ఒక్కసారిగా జలదరిస్తుంది. ఇలాంటి సీన్, తెలుగులో ఓ హీరో యాక్ట్ చేశాడంటే చాలామంది నమ్మరు కూడా. ఒకవేళ ఇలానే మనం కూడా కారులో చిక్కుకుపోతే ఏంటి పరిస్థితి అని సినిమా చూస్తున్న టైంలో ఒక్కసారైనా అనిపిస్తుంది. అంతలా మిమ్మల్ని థ్రిల్ కి గురిచేస్తుంది. చివర్లో ఓ మెసేజ్ తో సినిమాని ఎండ్ చేయడం కూడా బాగుంది. అది చూసిన తర్వాత అవును నిజమే కదా అని మనకు అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. ఇందులో మెయిన్ గా కనిపించేది శ్రీసింహా ఒక్కడే. ఆ తర్వాత ఎక్కువగా వినిపించేది డాక్టర్ చక్రవర్తి పాత్రలో శుభలేఖ సుధాకర్ వాయిస్. స్క్రీన్ ద్వారా కారులో చిక్కుకున్న దొంగతో ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. ఈ పాత్రని సముద్రఖని చేశాడు. చివర్లో ఆయన కొద్దిసేపు కనిపిస్తారు. ఇక రాజు భార్య నీరజ పాత్రలో ప్రీతి ఆశ్రానీ నటించింది. అంతకు తప్పించి మిగతా యాక్టర్స్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.

ఇక టెక్నికల్ విషయానికొస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించిన కాలభైరవ గురించి చెప్పుకోవాలి. యాక్టింగ్ తో శ్రీసింహా ఇంటెన్స్ క్రియేట్ చేస్తే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కాలభైరవ.. ఆ ఇంటెన్స్ ఇంకాస్త పెంచాడు. ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్ ఏంటంటే.. జస్ట్ గంటన్నర మాత్రమే. అందుకే జస్ట్ ఇలా స్టార్ట్ చేస్తే అలా కంప్లీట్ అయిపోతుంది. ఈ వీకెండ్ మంచి థ్రిల్లర్ సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నారా.. అయితే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’ని చూసేయండి. ఇక కెమెరామేన్ యశ్వంత్.. కారులో వరకు మాత్రమే విజువల్స్ చూపించాలి. అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఫైనల్ గా డైరెక్టర్ సతీష్ త్రిపుర. సినిమాను బాగానే తీశాడు. గానీ ఇంకాస్త థ్రిల్లింగ్ అంశాలు చేర్చుంటే ఆడియెన్స్ మరింత థ్రిల్ కి గురయ్యేవారు. ఇక ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే.. ఇలాంటి సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు. ఒకవేళ సర్వైవల్ థ్రిల్లర్స్ నచ్చితే గనుక.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: