రాజబాబు, పద్మనాభం, రమణారెడ్డి నుంచి బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్ వరకూ ఇలా ఎంతోమంది హాస్యనటులు తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ప్రత్యేకించి హాస్యనటుల కోసం దర్శకులు సీన్స్ రాసేవారంటే వాళ్ళకి ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా డిమాండ్ ఉన్న హాస్యనటుల్లో ఐరన్ లెగ్ శాస్త్రి ఒకరు. ఐరన్ లెగ్ శాస్త్రి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయన హాస్యంతో ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మానందం, ఐరన్ లెగ్ శాస్త్రి కాంబినేషన్ లో సీన్స్ చూస్తే ఇప్పటికీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. అంతలా ఐరన్ లెగ్ శాస్త్రి తనదైన శైలిలో నవ్విస్తారు. మరి ఇంతలా నవ్వించిన ఐరన్ లెగ్ శాస్త్రికి సినిమా అవకాశం ఎప్పుడు ఎలా వచ్చిందో తెలుసా? ఈయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన ఈయన సినిమాల్లోకి రాకముందు పురోహితుడిగా పనిచేసేవారు. ఒక శుభకార్యంలో ఈయన చతురతను చూసిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ, అప్పుల అప్పారావు సినిమాలో కమెడియన్ గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో ఈయనకు బాగా గుర్తింపు వచ్చింది.

150 సినిమాల్లో నటించి, తనదైన కామెడీతో కితకితలు పెట్టిన ఐరన్ లెగ్ శాస్త్రి అనే పేరుతోనే బాగా పాపులర్ అయ్యారు. అయితే ఆయనకు శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. మరోపక్క కుటుంబానికి అతనే పెద్ద దిక్కు కావడం వల్ల ఆర్ధిక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో ఆయన కుటుంబంతో సహా సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అక్కడ మళ్ళీ తన పాత వృత్తి అయిన పౌరాహిత్యం చేస్తూ జీవనం సాగించాలని అనుకున్నారు. కానీ సినిమాల్లో ఐరన్ లెగ్ అనే పేరు ఉండడంతో నిజ జీవితంలో కూడా ఆయనది ఐరన్ లెగ్ ఏమో అని జనం భయపడి ఆయనను పిలిచేవారుకాదట. శుభమా అని మంచి కార్యక్రమం జరుగుతుంటే ఐరన్ లెగ్, లెగ్ పెడితే అశుభం అని అనుకునేవారట. దీంతో ఆయన బతుకు మరీ భారంగా మారింది. ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యారు. అలా కొన్ని రోజులు గడిచాక ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు రావడంతో ఆయన పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో కుటుంబ సభ్యులు అప్పటి ప్రభుత్వాన్ని తమకు ఆర్థిక సాయం చేయమని అడిగారు. కొంతమంది సినీ ప్రముఖులు తమకు తోచినంత సాయం చేశారు. అయితే అవి ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరిపోలేదు. దీంతో ఆయన 2006 జూన్ 19న మరణించారు. చివరి రోజుల్లో ఆయన భౌతికకాయాన్ని అంబులెన్స్ లో కాకుండా రిక్షాలో తీసుకెళ్లడం బాధాకరమైన సంఘటన. భారీ కాయం వల్ల మనకి దగ్గరయ్యారు. కానీ అదే భారీ కాయం వల్ల ఆయన మనకి దూరం అయ్యారు. సినిమాల్లో ఐరన్ లెగ్ గా చెరగని ముద్ర వేసిన ఆయనకు, ఐరన్ లెగ్ అన్న పేరే ఆయన జీవితాన్ని
చెరిపేసింది. చిన్న వయసులో మంచి హాస్యనటుడ్ని మిస్ అయ్యాము..

మరింత సమాచారం తెలుసుకోండి: