‘గబ్బర్‌సింగ్’ చిత్రం విడుదలై 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, కమెడియన్ బండ్లగణేశ్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఈసారి ఆయన దర్శకుడు హరీష్ శంకర్ పేరును మెన్షన్ చేశాడు. అందులో ప్రత్యేకథ ఏముంది..? అంటారా..? ఉంది. ఎందుకంటే.. గతేడాది.. అంటే గబ్బర్ సింగ్ 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూడా బండ్ల గణేశ్ ఇలానే ఓ ప్రెస్ నోట్‌ విడుదల చేశాడు. కానీ అందులో ఎక్కడా దర్శకుడు హరీష్ శంకర్ పేరు ప్రస్తావించలేదు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగింది. అంతేకాదు.. బండ్ల వర్సెస్ హరీశ్ అనేలా ఒకరిపై మరొకరు తిట్ల దండకం ఎత్తుకునే స్థాయికి వీరిద్దరి వివాదం ముదిరింది. అయితే పెద్దలు కొంతమంది సర్ది చెప్పేసరికి వివాదం కొంత సర్దుమణిగింది.

కాగా.. బండ్ల గణేశ్ తాజాగా కరోనా బారిన పడ్డాడు. ప్రాణాలతో పోరాడి కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత నుంచి బండ్లలో పెద్ద మార్పు వచ్చింది. ఇకపై తాను ఎవరినీ దూషించేలా కానీ, బాధపెట్టేలా కానీ మాట్లాడనని జ్ఞానోదయం అయిన స్వామీజీలా చెప్పాడు. అంతే కాదు హరీష్ శంకర్‌కి కూడా సారీ చెప్పినంత పని చేశాడు. దీంతో హరీష్‌, బండ్ల మధ్య వార్‌కి కూడా ఫుల్‌స్టాప్ పడింది.

 ఇక తాజాగా బండ్ల చేసిన ట్వీట్‌లో.. ‘హిట్లు వస్తాయి, సూపర్ హిట్స్ వస్తాయి, బ్లాక్ బస్టర్ వస్తాయి.. కానీ గబ్బర్ సింగ్ మళ్ళీ రాదు. ఎప్పటికీ అది ఓ అనుభవం. మంచి గుర్తు. ఈ అనుభూతి ఇచ్చిన నా దైవం పవన్ కల్యాణ్‌గారికి పాదాభివందనాలు. అలాగే హరీష్ శంకర్‌గారికి, దేవీ శ్రీ ప్రసాద్‌గారికి నమస్కారాలు’ అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు హరీష్ శంకర్ కూడా రిప్లయ్ ఇవ్వడం విశేషం. ‘చాలా థ్యాంక్స్ బండ్ల గణేష్ అన్నగారు.. మీ తపన, మీ సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేను’ అంటూ హరీష్ శంకర్.. బండ్ల ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం పూర్తిగా చెరిగిపోయినట్లైంది. అంటే గబ్బర్ సింగ్ మళ్లీ వీళ్లని కలిపిందన్నమాట.




మరింత సమాచారం తెలుసుకోండి: