
పాతికేళ్ల తమిళ ముద్దు గుమ్మ నివేదా థామస్.. కోలీవుడ్ లో మాత్రమే కాదు మాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా తన అందం అభినయం నటనా చాతుర్యంతో మంచి నటీమణిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె నటించిన 20 పైచిలుకు సినిమాల్లో 13 చిత్రాలు వరకు సూపర్ హిట్స్ అయ్యాయి. మిగతా సినిమాలు కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆమె నటించిన ఒకటో రెండో సినిమాలు ఫ్లాపయ్యాయి కానీ మిగతావన్నీ కూడా ఆశించిన స్థాయిలో హిట్స్ అయ్యాయి. వాస్తవానికి నివేదా థామస్ పారితోషికాల తో సంబంధం లేకుండా మంచి సినిమాలను, పాత్రలను యాక్సెప్ట్ చేస్తుంటారు. ఆమె రీసెంట్ గా చేసిన సినిమాలను గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అందాల తార "శాకిని ఢాకిని" అనే ఒక తెలుగు యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ రూపొందిస్తున్న ఈ సినిమా "మిడ్ నైట్ రన్నర్" అనే జపనీస్ సినిమాకి రీమేక్ కాగా.. ఇందులో రెజీనా కసాండ్రా కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీసు ఉద్యోగాలు సంపాదించి ట్రైనింగ్ పీరియడ్ లో కొనసాగుతున్న ఇద్దరు లేడీ పోలీసులు ఉమెన్ ట్రాఫికర్స్ ముఠాను కటకటాల పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో లేడీ పోలీసులకు.. ఉమెన్ ట్రాఫికర్స్ ముఠాకి భారీ యుద్ధమే జరుగుతుంది. చివరికి క్రూరమైన ఈ ముఠాను ఎదిరించి తమని తాము రక్షించుకోవడం తోపాటు.. మిగిలిన వారిని ఎలా విడిపించారనేదే "శాకిని ఢాకిని" కథాంశం అని తెలుస్తోంది.
ఇప్పటికే నివేదాథామస్ ఈ చిత్రానికి సంబంధించి చాలా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాలో ఆమె చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను మినహాయించి ఆమె మరేతర సినిమాకి అంగీకరించలేదు. అయితే ప్రస్తుతం ఆమె కేవలం ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.