ఎన్ని సార్లు చూసినా.. మళ్లీ చూడాలనిపించే సినిమాల్లో "నువ్వు నాకు నచ్చావు" ఖచ్చితంగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, కథనం తో.. విజయభాస్కర్ దర్శకత్వంలో 2001 సెప్టెంబర్ 6వ తేదీన తెరకెక్కిన "నువ్వు నాకు నచ్చావ్" సినిమా.. రెండు దశాబ్దాల తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సినిమా లోని కామెడీ ఒక ఎత్తయితే.. లవ్ స్టోరీ మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ, డైలాగులు ఈ సినిమాకి ఆయువు పట్టు గా నిలిచాయి.


స్నేహం యొక్క గొప్పతనం, ప్రేమ యొక్క గొప్పతనం ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ చిత్రంలో వెంకటేష్.. వెంకీ అనే ఒక ఫన్నీ లీడ్ రోల్ లో నటించినప్పటికీ.. ఆ పాత్ర ద్వారా బంధాలు బంధుత్వాలకు సాటి మనుషులు ఎలా గౌరవం ఇవ్వాలో త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయభాస్కర్ చాలా చక్కగా చూపించారు. వెంకీని గాఢంగా ప్రేమించే అమ్మాయి పాత్రలో ఆర్తి అగర్వాల్ ఒదిగిపోయారని చెప్పవచ్చు. ఈ చిత్రంలో వీరిద్దరూ అసలు నటించినట్లే అనిపించలేదంటే.. వారు ఎంత సహజంగా నటించారో అర్థం చేసుకోవచ్చు.



వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ప్రేమ రియాల్టీకి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్తి అగర్వాల్ తన వెంట పడుతుంటే వెంకీ ఇబ్బంది పడే సన్నివేశాలు కూడా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. వారి మధ్య ఏర్పడే అలకలు కూడా విజయభాస్కర్ చాలా చక్కగా చూపించారు. ఈ చిత్రంలో కంటిచూపుతోనే వెంకీని తన వశం చేసుకుంటుంది ఆర్తి. ఆ తర్వాత కూడా అతడిని తన ప్రేమలో పడేయాలని బాగా ప్రయత్నిస్తుంది. కానీ తన తండ్రి స్నేహం చెడిపోకూడదని వెంకీ ఆర్తిని బాధపెడుతూనే తాను కూడా లోలోపల బాధపడుతుంటారు. చివరికి బ్రహ్మానందం అనుకోకుండా తీసిన ఒక ఫోటో కారణంగా వెంకీ, ఆర్తి లకు పెళ్లి అవుతుంది.



ఈ సినిమాలోని ప్రతి కమెడియన్ క్యారెక్టర్ హీరో హీరోయిన్ల ప్రేమ సఫలం కావడానికే ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఎమ్మెస్ నారాయణ తన తల్లి ఫోటోకి కళ్ళు డ్రా చేయాలని వెంకీకి చెప్తాడు. అప్పుడు వెంకీ ఆర్తి అగర్వాల్ కళ్ళు చూస్తూ ఎమ్మెస్ నారాయణ తల్లి కళ్ళు డ్రా చేస్తారు. ఈ సమయంలోనే వెంకీ ఆర్తి అగర్వాల్ పై మనసు పరేసుకుంటారు. సునీల్ పాత్ర కూడా వెంకీ, ఆర్తి లను కలిపే విధంగా తీర్చిదిద్దారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మొత్తంలో కామెడీ సన్నివేశాలన్నీ కూడా వెంకీ - ఆర్తి మధ్య ప్రేమను పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: