
రవితేజ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన భద్ర సినిమా అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. రవితేజను సరికొత్త కోణంలో చూపించే సినిమా ఇది. బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్రాజు తెరకెక్కించిన యాక్షన్ ఫ్యాక్షన్ సినిమా పదహారు వసంతాలు పూర్తిచేసుకుని ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ లలో ఒకటిగా నిలిచింది. తొలి చిత్రంతోనే తనలోని మాస్ పవర్ ను ప్రేక్షకులకు చూపించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మాస్ మసాల చిత్రాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.
మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించగా ప్రదీప్ రావత్ విలన్ గా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ మరదలు క్యారెక్టర్ లో నటించిన సత్య పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్ర పోషించిన నటి పేరు సనోబర్ హెరేకర్. ఆమె ఈ సినిమాలో కనిపించింది కొంచెంసేపు అయినా కూడా ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తనదైన ముద్రను వేసింది. మళ్లీ ఆమె నటిస్తే చూడాలని ఆమెను అభిమానించిన ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఈ సినిమా తరువాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు సనోబర్.
సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో సనోబర్ ఏమైపోయిందో అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ట్విట్టర్ ఎకౌంట్ ఒకటి దొరకడంతో ఆమెను పొలోమని ఫాలో అయిపోతున్నారు మన వీరాభిమానులు. అందులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒక మ్యూజిక్ లేబుల్ కి బిజినెస్ హెడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మ్యూజిక్ లేబుల్ పేరు క్రేసెండోమ్యూజిక్. ఈ మ్యూజిక్ లేబుల్ ద్వారా కొన్ని హిందీ పాటలను విడుదల చేశారు. ట్విట్టర్ లో 2016 నుంచి ఆమె ఉండగా, అజీజ్ అనే వ్యక్తి నీ ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.