ఇండస్ట్రీలో హీరోల‌కంటే హీరోయిన్ల‌కు కెరీర్ స్పాన్ తక్కువ అనే వాద‌న‌ కొత్త‌ది కాదు. కాలక్రమంలో రొటీన్‌గా మారిన ఈ సత్యం గురించి తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా ఓ వయస్సు తరువాత హీరోయిన్లకు తక్కువ అవకాశాలు రావడాన్ని చూసి, ఏజ్ గ్యాప్‌ లవ్ స్టోరీలు తెరపై చూపించడాన్ని ట్రోల్స్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇటీవల ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి కమల్ హాసన్ – త్రిష జోడీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై డైరెక్టర్ మణిరత్నం స్పష్టంగా స్పందిస్తూ, “పాత్రల గురించి మాట్లాడండి, వ్యక్తుల వయస్సుల గురించి కాదు. సొసైటీలో ఉన్న నిజాలనే మేము తెరపై చూపిస్తున్నాం” అని బలమైన సందేశం ఇచ్చారు.


ఇప్పుడు ఇదే విషయంపై శృతిహాసన్ కూడా తనదైన శైలిలో స్పందించారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో శృతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇది లవ్ ట్రాక్ కాదు కానీ, రజనీ సరసన స్క్రీన్ షేర్ చేయడమే సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు తలెత్తేలా చేశాయి. ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమెని ఏజ్ గ్యాప్ & స్క్రీన్ షేర్ అంశంపై ప్రశ్నించగా శృతి కొంచెం గట్టిగానే స్పందించారు – “నాకు ఎవరి వయసుతో పని లేదు. ఎవరు ఏం అంటారో నాకేం సంబంధం లేదు. నాకు పాత్ర ముఖ్యం. నేను నటనపై దృష్టిపెడతాను. పాత్రలో బలముంటే చాలు, వయసుతో పని లేదు” అంటూ కౌంటర్ ఇచ్చారు.



శృతి ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజు సినిమాల్లో సాధారణంగా మగవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఉంటాయన్న విమర్శల మధ్య, శృతికి మాత్రం ఓ పవర్‌ఫుల్ పాత్ర దక్కడం గమనార్హం. ఆమె పాత్ర సినిమాకే టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని సమాచారం. ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ మాస్ రీ ఎంట్రీగా డిజైన్ చేసిన ఈ చిత్రంలో శృతికి ఉండే ప్రాధాన్యం, ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. “ఓ మంచి పాత్రకోసం ఏ వయస్సు హీరోతోనైనా నటించేందుకు నేను సిద్ధం” అన్న శృతి స్టేట్‌మెంట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: