
నేడు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా అభిమానులు ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయన తన నాన్న పేరు వాడుకోకుండా, తన సొంత ప్రతిభతోనే ఎదిగారు. సాధారణంగా స్టార్ హీరోల కొడుకులకు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఆఫర్లు వస్తాయి. కానీ నాగార్జునకు అలాంటి అవకాశాలు రాలేదు. ఆయన చాలా కష్టపడి, ఒక్కో మెట్టు ఎక్కుతూ తన స్థానం సంపాదించారు. కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్స్‌ను ఎదుర్కొన్నప్పటికీ, వాటిలోనుంచి సక్సెస్‌ను వెతుక్కుంటూ ముందుకు సాగారు.
ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా బయటపడిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అందరికీ నాగార్జునగా తెలిసిన కింగ్ నాగార్జున అసలు పేరు నిజానికి నాగార్జునసాగర్ అని. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన జన్మించిన సమయంలోనే నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం జరుగుతుండడంతో, దానికి ప్రభావితులైన నాగేశ్వరరావు గారు తన చిన్న కుమారుడికి ఆ పేరు పెట్టారట. “నాగార్జునసాగర్” అనే పేరు వినిపిస్తే, నాగేశ్వరరావు తన కొడుకును గుర్తు చేసుకోవాలి అన్న భావనతో ఆయన ఆ పేరు పెట్టారట. తరువాత సినిమాల్లోకి వచ్చినప్పుడు నాగార్జున తన పేరులోని “సాగర్” అనే పదాన్ని తొలగించి, “నాగార్జున”గా మార్చుకున్నారు. ఆ తర్వాత ఆయన “నాగ్”, “కింగ్ నాగ్”, “మన్మథుడు నాగ్” అంటూ అభిమానుల పిలుపుల్లో కొత్త కొత్త బిరుదులు సంపాదించారు. అభిమానులు ఆయనను ఏ పేరుతో పిలిచినా, ఆయనపై చూపే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. నాగార్జున ఈ స్థాయిలో ఉండటానికి ఆయన నటించిన సినిమాలే ప్రధాన కారణం అని చెప్పడంలో సందేహం లేదు.