భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన వ్య‌క్తుల జాబితాలో మణిరత్నం, శంకర్, ఏఆర్ మురుగదాస్ పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. వీరు కేవలం హిట్ సినిమాలు చేసిన దర్శకులు కాదు. తమ తమ శైలిలో కొత్త భాషను, కొత్త ఆలోచనను, కొత్త ట్రీట్మెంట్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేసిన గేమ్ ఛేంజర్స్. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఈ ముగ్గురిలో ఎవరు కొత్త సినిమాలు అనౌన్స్ చేసినా, ఆరంభంలో భారీ హైప్ వస్తుంది. కానీ విడుదలైన తరువాత కలసి రావడంలేదు. ఈ లెంజ‌డ‌రీ డైరెక్ట‌ర్స్ క్ర‌మ‌క్ర‌మంగా త‌మ ఫామ్‌ను కోల్పోతున్నారు. వ‌రుస‌గా ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొంటున్నారు. మ‌ళ్లీ కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్న ప్ర‌తిసారి నిరాశ‌ప‌రుస్తున్నారు.


మణిరత్నం.. ఒక‌ప్పుడు ఎమోషన్‌కి ఆర్కిటెక్ట్. `గీతాంజ‌లి`లో డెత్ అప్రోచ్ అయినా, `బొంబాయి`లో హిందూ-ముస్లిం లవ్ స్టోరీ అయినా… మణిరత్నం చూపిన ఎమోషన్ రియలిస్టిక్‌గా మ‌రియు సినిమాటిక్‌గా ఉండేది. సాధారణ ప్రేమకథను కూడా `రోజా`లా ఇంటెన్స్‌గా, `దిల్ సే`లా డార్క్‌గా చూపగల విజ‌న‌రీ ఆయ‌న సొంతం. క్లాసిక్ టచ్‌తో కమర్షియల్ సక్సెస్ సాధించడం మ‌ణిర‌త్నం సిగ్నేచర్. ఒక సినిమాను చూసిన తర్వాత కన్నా వినిపించే పాటలతోనే హైప్ క్రియేట్ చేయడం ఆయనకు ఉన్న మ‌రో ప్రత్యేకత. అయితే మ‌ణిర‌త్నం మ్యాజిక్ ఇప్పుడు వెండితెర‌పై క‌నిపించ‌డం లేదు. `పొన్నియిన్ సెల్వన్` సినిమాల‌పై భారీ అంచనాలు పెంచుకున్నా, నార్మల్ కలెక్షన్స్ తప్ప, మాస్స్ కంస్యూమర్స్ కి కనెక్ట్ కాలేకపోయాయి. ఈ మ‌ధ్య వ‌చ్చిన `థ‌గ్ లైఫ్‌` సైతం దారుణ‌మైన ఫ‌లితాన్ని మూట‌గ‌ట్టుకుంది.


శంకర్.. సోషల్ మెసేజ్ ప్ల‌స్‌ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అనే కొత్త మిక్స్‌ను పరిచయం చేసిన వ్య‌క్తి. `జెంటిల్‌మన్`, `ఇండియన్`, `ఒకే ఒక్కడు` సినిమాలు ఇందుకు ప్రూఫ్. సీజీఐ, వీఎఫ్ఎక్స్‌, భారీ సెట్స్, స్టైలిష్ సాంగ్స్.. ఇలా భారతీయ సినిమాకు హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ విల్యూస్ తీసుకువచ్చిందీ శంక‌రే.
`శివాజీ`, `అపరిచితుడు`, `2.0` వంటి చిత్రాలు శంక‌ర్ ను విజువల్ షోమ్యాన్ అని ఎందుకు పిలుస్తారో చూపిస్తాయి. కానీ గ‌త కొన్నేళ్లుగా శంక‌ర్ కు ఫెయిల్యూర్స్ త‌ప్ప స‌క్సెస్ అనేది లేదు. ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన `ఇండియ‌న్ 2`, `గేమ్ ఛేంజ‌ర్‌` చిత్రాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డాయి.


ఏఆర్ మురుగదాస్.. `గ‌జిని`తో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లాంటి క్లిష్టమైన సబ్జెక్ట్‌ని మాస్ ఆడియన్స్ కూడా అర్థం చేసుకునేలా చూపించి త‌న మార్క్ క్రియేట్ చేశారు. మాస్ హీరోలను నూతన కోణంలో చూపించడం ఆయ‌న స్పెషాలిటీ. మురుగదాస్ కథనం ఎప్పుడూ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. ఆడియన్స్‌ని చివరి నిమిషం వరకు సీట్ అంచున కూర్చోబెట్టగలిగేవారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. స్టోరీ టెల్లింగ్ రిపిటేటివ్‌గా ఉండ‌టం, ఆడియన్స్ ఐక్యూ కి తగిన అప్‌గ్రేడ్ లేకపోవడంతో ఆయ‌న‌కున్న మాస్ ఫార్ములా డైరెక్టర్ అనే ఇమేజ్ క్ర‌మంగా డ్యామేజ్ అవుతోంది. తాజాగా విడుద‌లైన `మ‌ద‌రాసి`తో మురుగ‌దాస్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ ప‌డ‌టం ఖాయ‌మైంది.


మొత్తంగా మణిరత్నం ఎమోషన్లతో, శంకర్ విజువల్స్‌తో, మురుగదాస్ మాస్-కమర్షియల్ మిశ్రమంతో తమ ముద్ర వేశారు. కానీ ప్ర‌స్తుతం వీరి ఫామ్ త‌గ్గిపోయింది. క్రియేటివిటీ కన్నా, టెక్నికల్ గిమ్మిక్స్‌పై డిపెండెన్స్ పెరిగిపోయింది. కొత్త తరం దర్శకులు ఫ్రెష్ ఐడియాస్‌తో ముందుకు వస్తున్నారు. సో.. మణిరత్నం, శంకర్, మురుగదాస్.. ఈ ముగ్గురు లెజెండ్స్ నుంచి కోరుకునేది ఒక్క‌టే `తిరిగి ఒక్క‌సారైనా పాత మ్యాజిక్ ను చూపించండి లేదంటే రిటైర్మెంట్ ఇచ్చేయండి బాస్`.  

మరింత సమాచారం తెలుసుకోండి: