
విశాఖ మహాధనికుడైన వ్యాపారి కుమార్తె. సహజ సౌందర్యం తోడు చదువు, సంస్కారం, తెలివితేటలతో మిక్కిలి ఆకర్షణీయంగా ఉంటుంది. శాస్త్రాలు చెప్పే అన్ని సౌందర్య లక్షణాలు ఆమెకు ఉన్నాయి. పైకి సుకుమారంగా కనపడినా మానసిక బలంతోపాటు శారీరక బలం కూడా ఎక్కువ. ధైర్యం ఎక్కువ. బుద్ధుడిని అభిమానించి ఒక ఆరామాన్ని నిర్మించి ఇచ్చిన ఉదార స్వభావం విశాఖ సొంతం.
ఒక ఉత్సవం రోజు ఊరిబయట కాల్వలో స్నానం కొరకు విశాఖ తన స్నేహితురాళ్లను తోడు తీసుకొని వెళ్లింది. కాల్వలో స్నానానికి దిగకముందే వర్షం పడసాగింది. ఆమెతోపాటు వచ్చిన స్నేహితురాళ్లంతా దగ్గరలో కనపడుతున్న మండపంలోకి పోయి తడవకుండా జాగ్రత్తపడ్డారు. విశాఖ మండపంలోకి పరిగెత్తకుండా వర్షంలోనే తడుస్తూ నడుచుకుంటూ వెళ్లింది. అప్పటికి ఆమె తడిసి ముద్దయింది. అప్పటికే వర్షానికి ఆ మండపంలో తలదాచుకున్న పరదేశి బ్రాహ్మణులు విశాఖను దూషించసాగారు. మహారాణిలా వగలు పోతున్నావు.. చిన్నగా నడిచి కాకుండా వేగంగా వచ్చివుంటే తడిచి ఉండేదానికి కాదు కదా!! అని. ఆ పరదేశి బ్రాహ్మణుల మదలింపు మాటలకు ఆమె సిగ్గుపడి తలదించుకోలేదు. చిన్నబుచ్చుకొని దుఃఖంలో మునగలేదు. వాళ్లకు తిరిగి ఇలా బదులిచ్చింది. సభకు వస్తున్న రాజు పరుగెత్తుకు వస్తే అది అనుచితంగా ఉంటుంది.. ఒక సాధువు పరిగెత్తడం అనుచితంగా ఉంటుంది.. అలాగే స్త్రీ కూడా పరిగెత్తడం అసహజంగా ఉంటుంది. మీకు తెలియదా? నేను పరిగెత్తడం కూడా అసహజంగా ఉంటుంది. అందుకే పరిగెత్తలేదు అని బదులిచ్చింది.
విశాఖ సమాధానమిస్తున్న సమయంలో ఆ బ్రాహ్మణులు ఆమెను పరిశీలనగా చూశారు. ఆమె శిరోజాలు, దంతాల వరుస, పెదవులు, దేహఛాయ, యవ్వన సంపదను పరిశీలించారు. వారికి చాలా ఆనందమేసింది. ఎందుకంటే వారిది శ్రావస్తి నివాసస్తులు. ఆ నగరంలో మహాధనికుడైన మిగారుడి దూతలు వారు. అతని ఒక్కగానొక్క కుమారుడైన పుణ్యవర్ధనుడికి తగిన సంబంధం కోసమని ఊరూరా తిరుగుతున్నారు. తన కుమారుడికి వధువు కోసం మిగారుడు ప్రత్యేక దూతలుగా వీరిని నియమించారు.