రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల పై కాషాయ దళం ఫోకస్ పెడుతోంది. బలమైన నేతల కోసం ఇప్పటినుంచే ఆరా తీస్తున్నది. అవసరమైతే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన అభ్యర్థులను పార్టీ లోకి లాగి కాషాయ తీర్థం పుచ్చుకునేలా చేయాలని జాతీయ నాయకత్వం ప్రణాళికలు చేస్తున్నది. అందులో భాగంగా ఆపరేషన్ 17 కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బీజేపీ ఖాతాలో నాలుగు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ లతోపాటు మిగిలిన 13 పార్లమెంటు స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసింది.

విక్టరీ జోష్ ను ఇలాగే కొనసాగిస్తూ ఇంకొంచెం కష్టపడితే చాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతర్గతంగా ఇప్పటికే ఇతర పార్టీలో గెలుపు అవకాశాలు ఉన్న నేతలను తమ వైపు తిప్పుకునే పనిలో పడినట్లు సమాచారం. పార్టీలో పట్టుకోసం ఎంపీ స్థానాలే టార్గెట్ గా ఆపరేషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఎంపీ స్థానాలతో  పాటు అసెంబ్లీ స్థానాలపై కూడా పట్టు సాధించాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల పై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు బిజెపి యత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు వేసి కార్యాచరణను సైతం రూపొందించింది. గతంలోనే ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలతో బీజేపీ రాష్ట్ర అధికారులు సమావేశాలు నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళితే సగం సక్సెస్ అయినట్లేనని, కెసిఆర్ ఇస్తామని అమలు చేయాని హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఆదేశించింది. వీటితో పాటు పార్టీకి అసలు పట్టు లేని నల్లగొండ ఎంపీ స్థానంపై కన్నేసినట్టుగా చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన ఓ నేత తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో ఆ నేత ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో సమావేశమైనట్లుగా చర్చ సాగుతోంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ స్థానమైన జహీరాబాద్ పైన బీజేపీ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ స్థానం నుంచి అటు జాతీయ నాయకత్వం, మహారాష్ట్ర బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక ఏ మాత్రం కేడర్ లేని ఖమ్మంలోనూ పట్టుకోసం బిజెపి నాయకత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారని త్వరలో వారు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వీరు బిజెపి లో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాను బీజేపీ కైవసం చేసుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: