బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాస్తవానికి ఈ తుపాను ప్రభావం సోమవారం మొదలై, మంగళవారం అత్యథిక స్థాయికి చేరుకుంటుందనే అంచనాలున్నా.. అది ఆదివారమే భయంకరంగా మారింది. కోస్తా జిల్లాల్లో పెను విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈదురు గాలులు, భారీ వర్షాలకు చెట్లు నేలకూలాయి, పంటలకు తీవ్ర నష్టంవాటిల్లింది.

ఇక అసని తుపాను రాగల 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నాటికి తుపాను ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని ఇదివరకే అధికారులు తెలిపారు. ఆ తర్వాత అది తన దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతుందని, ఒడిశాలోనే అది తీరం దాటుతుందనే అంచనాలున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అసని తుపాను తీరం దాటే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. ఈ అసని తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం సాయంత్రం నుంచి రెండు రోజులపాటు.. ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా పడే సూచనలున్నాయి. మత్స్యకారులు వేటకు వెల్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడికక్కడ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

అసని అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
తుపానులకు ఆయా సముద్రాలకు చుట్టుపక్కల ఉండే దేశాలు వంతుల వారీగా పేర్లు పెట్టడం అలవాటు. ఆ దేశాల నుంచి సమాచారం సేకరించి, వారి వద్ద సూచనలు తీసుకుని అంతర్జాతీయ సంస్థలు పేర్లు పెడుతుంటాయి. ఈ దఫా ఆ అవకాశం శ్రీలంకకు దక్కింది. ఈ తుపానుకు అసని అని శ్రీలంక పేరు పెట్టింది. అసని అంటే  శ్రీలంకలో ఉన్న సింహళ భాషలో కోపం, ఆగ్రహం అనే అర్థం వస్తుందట. అసని తీవ్ర తుపాను కాబట్టి.. దానికి ఆ పేరు పెట్టారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ తుపాను కాస్త ఊరటనిచ్చినా, రైతన్నలకు మాత్రం దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: