రామోజీ ఫిలింసిటీకి తెలంగాణ ప్రభుత్వం 295 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించిందన్న వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభుత్వ భూములను కేటాయిస్తే ఇందులో పెద్దగా వివాదం ఏమీ ఉండకపోవచ్చు.. కానీ ఇవన్నీ అసైన్డ్ భూములు కావడం వల్ల వివాదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలో 250.13 ఎకరాలు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో 125.24 ఎకరాల భూమి అప్పగించేందుకు ఫైళ్లు రెడీ అవుతున్నాయట.
రామోజీ ఫిలింసిటీ అడిగిన 295 ఎకరాలకుతోడు మరో 81 ఎకరాలు కూడా విభజించలేమని ఫిల్మ్ సిటీ అవసరాలకు వాడుకోవచ్చని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయట. అంటే మొత్తం 376 ఎకరాలు రామోజీ ఫిలింసిటీకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ భూములను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఈ భూములను కొనుగోలు చేసేందుకు రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఇప్పటికే అంగీకారం తెలిపింది.
మొత్తం 376.32 ఎకరాలకు సంబంధించిన అసైన్‌దారులకు పరిహారం చెల్లించేందుకు రూ.37.65 కోట్లను డిపాజిట్ చేయాలని రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యాన్ని తెలంగాణ సర్కారు కోరిందట. ఈ భూములన్నీ ప్రస్తుతం నిరుపయోగంగానే ఉండటం గమనార్హం.. అయితే నాగన్‌పల్లిలో భూములకు పరిహారాన్ని ఎకరాకు రూ.10 లక్షలు తెలంగాణ సర్కారు అంచనా వేస్తోంది.
మరి అంత తక్కువ పరిహారం తీసుకునేందుకు ఎసైన్డ్ హక్కుదారులు అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. అక్కడ మార్కెట్ విలువ ఎకరం 15 నుంచి 20 లక్షలుగా ఉందనేది ప్రభుత్వ వర్గాల అంచనా.. అంత తక్కువ పరిహారం తీసుకునేందుకు రైతులు అంగీకరించకపోతే.. ఈ భూసేకరణ కూడా వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. చూడాలి ఏంజరుగుతుందో..!?