రెండోసారి భారత ప్రధానిగా అవకాశం దక్కించుకున్న నరేంద్ర మోడీ.. పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి వారు కూడా మోడీని తెగపొగిడేస్తున్నారు. ఇక జాతీయంగా, అంతర్జాతీయంగా మోడీ అందుకున్న అవార్డులు, పురస్కారాలకు కొదువ లేదు. ఆయన అనేక సార్లు టైమ్స్ మేగజైన్ కవర్ పేజీపైనా దర్శనమిచ్చారు.


కానీ తాజాగా మోడీ అందుకున్న అవార్డు మాత్రం చాలా ప్రత్యేకమైంది. భారత దేశంలో చేపట్టిన ‘స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌’కు బిల్‌ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ మోడీకి ‘గ్లోబల్‌ గోల్‌ కీపర్‌’ అవార్డు ఇచ్చింది. దాన్ని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ చేతుల మీదుగా మోడీ అందుకున్నారు. మిగిలిన అవార్డులు రాజకీయాల కోసమో, దౌత్య సంబంధాల కోసమే వస్తే.. ఇది మాత్రం పరిశుభ్రత కోసం వచ్చిన అవార్డు.


అందుకే ఇది తనకు చాలా ప్రత్యేకమైందని నరేంద్ర మోడీ అంటున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా మోడీ ప్రసంగించారు. ఇది తనకు ఒక్కడికే దక్కిన గౌరవం కాదని యావత్‌ భారతీయులందరిదని సగర్వంగా చెప్పుకొచ్చారు మోడీ. ఆయన ఇంకా ఏమన్నారంటే..

" ‘స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌’ విజయవంతం కావడానికి కారణమైన యావత్‌ భారతీయులందరికీ దక్కిన గౌరవం ఇది. మహాత్మా గాంధీ 150వ జయంతి జరుపుకోనున్న ఏడాదిలోనే నాకు ఈ అవార్డు వచ్చింది. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా ముఖ్యమైంది. గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 11 కోట్ల మరుగుదొడ్లు కట్టించాం. ఈ పథకం వల్ల ఎవరికైనా లాభం చేకూరింది అంటే అది కచ్చితంగా పేద మహిళలకే.


ఇన్ని రోజులు మహిళలు, ఆడకూతుళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని కారణంగా బడి మానేసిన బాలికలు కూడా ఉన్నారు. ఈ సమస్యను ఛేదించడం మా ప్రభుత్వం బాధ్యత. మేం దీన్ని నిజాయతీగా అధిగమించగలిగాం. ఫలితంగా మహాత్మా గాంధీ కలలు కన్న పరిశుభ్రమైన భారత్‌ను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: