గుంటూరు.... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అండగా నిలిచే జిల్లా. గుంటూరులో మెజారిటీ సీట్లు దక్కించుకున్న ప్రతిసారి టీడీపీ అధికారంలోకి వచ్చేది. ఈ విషయం 2014 ఎన్నికల్లో కూడా రుజువైంది. ఆ ఎన్నికల్లో గుంటూరులో 17 సీట్లకి గాను టీడీపీ 12 సీట్లు గెలుచుకోగా, వైసీపీ 5 సీట్లు గెలుచుకుంది. అలాగే టీడీపీ మూడు ఎంపీ సీట్లు దక్కించుకుంది. అయితే 2019 ఎన్నికలకొచ్చేసరికి మొత్తం తారుమారైపోయింది. రాష్ట్రం మొత్తం జగన్ గాలి వీయడంతో టీడీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. గుంటూరు జిల్లాలో ఆ పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అలాగే గుంటూరు ఎంపీ సీటుని దక్కించుకుంది. ఇక వైసీపీ 15 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది.


సరే దారుణంగా ఓడిపోయి ఆరు నెలలు కావొస్తుంది. ఓ వైపు అధినేత చంద్రబాబు రాజధానిలో ఉంటూ, వైసీపీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే, మరోవైపు టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అటు మంగళగిరిలో ఓడిపోయిన ఆయన తనయుడు లోకేశ్ కూడా, ఏదొక రకంగా పోరాటం చేస్తున్నారు. అయితే వీరికి జిల్లాలోని మిగతా నేతల మద్ధతు కరువైంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడూ అంతా తామై వ్యవహరించిన చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, వినుకొండ-జీవీ ఆంజనేయులు, పొన్నూరు-ధూళ్లిపాళ్ళ నరేంద్ర, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు కంటికి కనపడటంలేదు.


ఏదో అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా కనిపించడం తప్ప పెద్దగా పార్టీని బలోపేతం చేసే పనిలో ఉండటం లేదు. ఇక సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వేమూరు మాజీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా, ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లు యాక్టివ్ గా ఉన్నారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే కూడా పర్వాలేదనిపిస్తున్నారు.


ఇక బాపట్ల మాజీ ఎంపీ శ్రీరామ్ మల్యాద్రి ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. నరసారావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వయసు రీత్యా బయటకు రావడం లేదు.  అయితే గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గెలిచిన మద్దాలి గిరిధర్ లు పార్టీలో యాక్టివ్ గానే తిరుగుతున్నారు. అటు రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాత్రం అప్పుడెప్పుడో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కనిపించడమే...మళ్ళీ అడ్రెస్ లేరు. మొత్తానికైతే కంచుకోట లాంటి గుంటూరులో టీడీపీ ఇప్పుడు కష్టాలు ఎదుర్కుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: