అంబటి రాంబాబు....రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. అప్పుడు వైఎస్‌కు ఇప్పుడు జగన్‌కు వీర విధేయుడు. రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన వైఎస్ ఫ్యామిలీ వెంటే నడిచారు. మంచి మాటకారి..సున్నితంగానే ప్రతిపక్షాలకు చురకలు అంటిస్తారు. అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో కౌంటర్లు వేస్తారు. ఇక రాంబాబు పోలిటికల్ కెరీర్ చూసుకుంటే...ఆయన 1989లో రేపల్లె నుంచి తొలిసారి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994, 99లో అదే కాంగ్రెస్ నుంచి ఓడిపోయారు.

 

ఇక తర్వాత కాంగ్రెస్ టికెట్ రాకపోయినా, వైఎస్ అనుచరుడుగా ముందుకెళ్లారు. తర్వాత ఆయన మరణంతో జగన్ వెంట నడిచి 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మళ్ళీ నిలుచుని విజయం అందుకున్నారు. అంబటి ఎమ్మెల్యేగా గెలవడంతో, జగన్ మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణల్లో భాగంగా అంబటికి పదవి రాలేదు. అయినా పార్టీలో అంబటి ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు.

 

అటు ప్రతిపక్ష టీడీపీని కట్టడి చేయడంలో అంబటి ముందున్నారు. మీడియా ముందు అవ్వోచ్చు, అసెంబ్లీలో కావొచ్చు బాబు బ్యాచ్‌ని ఏకీపారేస్తారు. తనదైన ప్రాసలతో టీడీపీకి కౌంటర్లు ఇస్తారు. గత 8 నెలలుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా టీడీపీని ముప్పుతిప్పలు పెట్టడంలో ముందున్నారు. అయితే విమర్శలు చేయడంలో ముందున్న అంబటి...సత్తెనపల్లి నియోజకవర్గంలో సమస్యల పరిష్కరించడంలో బాగానే కష్టపడుతున్నారు. కాకపోతే ఈయన ఎక్కువ మీడియాలో ఉంటూ, ప్రజల్లో తక్కువ ఉంటున్నారనే వాదన కూడా ఉంది.

 

అయితే ప్రభుత్వం ఏర్పడి 8 నెలలే అయింది కాబట్టి, నియోజకవర్గంలో పెద్ద అభివృద్ధి ఏం జరగలేదు. కానీ ఇటీవల సి‌సి రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి. ఇదంతా బాగానే ఉన్న రాజధాని అమరావతి వ్యవహారం అంబటికి కాస్త తలనొప్పిగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే అమరావతి ప్రాంతం పక్కనే సత్తెనపల్లి ఉంటుంది. దీంతో అక్కడి వారు అమరావతివైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అంబటి మిగతా ఎమ్మెల్యేల తో కలిపి మూడు రాజధానులకు మద్ధతుగా ర్యాలీ చేసిన, అది వైసీపీ కేడర్ వరకే పరిమితమైందని వార్తలు వచ్చాయి. పైగా ఈ అమరావతి వల్లే కావొచ్చు, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన గుంటూరు ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్ లో అంబటి ఆఖరి నుంచి మూడో స్థానంలో ఉన్నారు. మొత్తానికైతే అంబటికి అమరావతి ఒక్కటే పెద్ద ప్రాబ్లంలా ఉందని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: