కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామలంలో పుట్టిన ఓ వ్యక్తి... సినీరంగంలో ఎవరి అండా లేకపోయినా దాదాపు 40 ఏళ్లకు పైగా ఏకచ్చత్రాధిపత్యంగా ఏల గలడా... కృష్ణా జిల్లాలో ఏ మారు మూల పల్లెలో పుట్టిన ఓ వ్యక్తి.. ఈ దేశ ప్రధానినే గడగడలాడించగలడా... ? ఒక వేళ.. ఈ రెండూ నిజమే అయినా.. ఈ రెండింటినీ జీవితంలో ఒకే వ్యక్తి సాధించగలరా.. సాధించగలిగాడు.. సాధించి విజేత అయ్యాడు. ఆయనే నందమూరి తారక రామారావు.

 

IHG

 

సినిమాలపై ఆపేక్షతో చదువైన తర్వాత.. మద్రాసు చేరుకున్న నందమూరి తారక రామారావు.. ఎన్టీఆర్ గా ప్రేక్షకులపాలిట ఆరాధ్య దైవంగా మారారు. నాలుగున్నర దశాబ్దాల సమయంలో తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. సినీరంగంలో ఆయన కేవలం నటుడే కాదు.. నిర్మాతగా, దర్శకుడిగానూ సత్తా చాటారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించాడు. ప్రత్యేకించి రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉండేవారేమో అన్నంతగా జనం హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

IHG

 

నటుడిగానే జన్మ చరితార్థం చేసుకున్న ఎన్టీఆర్.. నటన నుంచి విశ్రాంతి తీసుకునే సమయంలో కీలకమైన రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి... కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించి ముఖ్యమంత్రి అయ్యారు. సామాన్యుడికి సైతం రాజకీయాలను చేరువ చేశారు. రెండు రూపాయలకే కిలోబియ్యం, జనతా వస్త్రాలు వంటి పథకాలతో పేదల పాలిట దైవంగా మారారు.

 

IHG

 

అంతే కాదు.. మండల వ్యవస్థ వంటి అనేక రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు పదవులు అంటూ కొత్త రాజకీయం నేర్పారు. ఇలా తెలుగు రాజకీయాలను మేలిమలుపు తిప్పారు. అంతే కాదు.. నేషనల్ ఫ్రంట్ పేరుతో జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసి కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ గవర్నర్ ను అడ్డుపెట్టుకుని సీఎం కుర్చీ నుంచి కూలదోసిన సమయంలో సాహసోపేతంగా వ్యవహరించి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి కేంద్రం మెడలు వంచగలిగారు.

 

IHG

ఇలా సినీ, రాజకీయ రంగాలు రెండింటిలోనూ సంచలనాలకు మారు పేరుగా నిలిచిన నందమూరి తారక రామారావు నిజజీవితంలో అసలైన విజేతగా నిలిచారు. చివరకు అల్లుడి చేతిలోనే వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్... చివరి రోజుల్లో మాత్రం వేదన అనుభవించారు. 1996 జనవరి 18న పరమపదించినా... తెలుగు వారి గుండెల్లో మాత్రం చిరంజీవిగా మిగిలారు.

మరింత సమాచారం తెలుసుకోండి: