టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్టులు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ ఇద్దరికీ పార్టీ నుంచి ఫుల్ సపోర్టు లభిస్తోంది. వీరిపై జగన్ సర్కారు కక్ష సాధిస్తోందని టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే దీనిని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. కార్మికుల సొమ్మును పందికొక్కులా తిన్న అచ్చెన్నాయుడిని సాక్షాధారాలతో సహా అరెస్టు చేశామంటున్నారు. చట్టాలు అందరికీ సమానమేనని, బీసీలకు, అగ్రవర్ణాలకు సపరేట్‌ చట్టాలు ఉన్నాయా..? అని చంద్రబాబు, లోకేష్‌లను ప్రశ్నిస్తున్నారు.

 

 

రూ.150 కోట్ల స్కామ్‌ చేసిన వ్యక్తికి మద్దతు తెలపడం సిగ్గుచేటని వైసీపీ నేతలు అంటున్నారు. అచ్చెన్నాయుడు స్వాతంత్య్ర సమరయోధుడా..? లేక జ్యోతిరావు పూలేనా..? ప్రజల ప్రాణాలను బలిగొన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి మహానుభావుడా..? సత్యహరిశ్చంద్రుడా..? అని ధ్వజమెత్తారు. బీసీలందరికీ సిగ్గుండాలని లోకేష్‌ మాట్లాడుతున్నాడని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఫైర్ అవుతున్నారు. లోకేష్‌ నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు.

 

 

అంతేకాదు.. ఈ ఈఎస్‌ ఐ మందుల స్కామ్‌తో అచ్చెన్నాయుడికి సంబంధం లేదు.. ముఖ్యమంత్రిగా నేను చెబితేనే చేశాడని చంద్రబాబును ఒప్పుకోగలడా..? అని వైసీపీ మంత్రులు ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిని ప్రతిపక్షంలో ఉండగానే.. ‘ఎంపరర్‌ ఆఫ్‌ కరెప్షన్‌’ పుస్తకం ద్వారా బయటపెట్టామని గుర్తు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన సెక్రటేరియట్‌లో లీకులు, సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీ, ఇసుక, సదావర్తి భూములు, చంద్రన్న కానుక, ఫైబర్‌ గ్రిడ్‌లలో దోపిడీ, విశాఖలో ల్యాండ్‌ స్కామ్, రాజధాని పేరుతో భూ దోపిడీ, అనేక స్కీమ్‌లను స్కామ్‌లుగా మర్చిన నీచ చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేస్తున్నారు.

 

 

చంద్రబాబు ఏ దోపిడీ చేయకపోయి ఉంటే ఆనాడే విచారణకు వెళ్లి చిత్తశుద్ధి నిరూపించుకునేవాడని చెబుతున్నారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పామని, చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నామన్నారు. అవినీతి బాగోతం బయటకు వస్తుంటే తప్పించుకోవడానికి చంద్రబాబు కులాల ప్రస్తావన తీసుకువస్తున్నాడని వైసీపీ మంత్రులు గుర్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: