లోకల్ బాడీ ఎన్నికల కోసం ప్రతిపక్ష టీడీపీ ఇపుడు ఆరాటపడుతోంది. మార్చిలో కరోనా భయంతో ఎన్నికల వాయిదాను సమర్ధించిన ఆ పార్టీ ఇపుడు మాత్రం ఎన్నికలు అర్జంటుగా పెట్టాలంటోంది. ఆనాడు టీడీపీ ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా, కేవలం ఎన్నికలు, పదవులు మాత్రమే కావాలా అంటూ అధికార పార్టీని దారుణంగా విమర్శించింది. చిత్రమేంటంటే ఆనాడు రోజుకు కేవలం రెండు మూడు కేసులు మాత్రమే  ఏపీలో వచ్చాయి. ఇపుడు చూస్తే రోజుకు మూడు వేలకు పైగా కేసులు వస్తున్నాయి. అయినా సరే అంతా బాగుంది, ఎన్నికలు పెట్టేయవచ్చు అని టీడీపీ తొందరపెడుతోంది.

అయితే వైసీపీ ఆలోచనలు వేరు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత అసలు  లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపీ సర్కార్ మీద ఆయన డౌట్లు వ్యక్తం చేశారు. ఇక నిమ్మగడ్డ మీద ఏకంగా సీఎం హోదాలో జగన్ గవర్నర్ కి ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనకు సామాజిక, పార్టీ అనుకూలతను కూడా ఆపాదించారు. మరి ఇలా ఉప్పూ నిప్పులా ఉన్న వేళ ఏపీలో ఎన్నికలు ఎలా జరుగుతాయి అన్నది పెద్ద చర్చ.

అయిత వైసీపీ మాత్రం స్థానిక ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించకూడదని గట్టిగానే నిర్ణయించుకుని అని అంటున్నారు. ఇపుడు వైసీపీ అనుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా మటుకు  వాయిదా పడ్డాయి. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ కూడా అసలు జరగలేదు. ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే కనీసం మూడు నాలుగు నెలల సమయం పడుతుంది. అప్పటికి పూర్తి సానుకూలతను తెచ్చుకుని ఎన్నికలను ఎదుర్కోవాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట.

అదే విధంగా ఏపీలో కొత్తగా 26 జిల్లాలు రాబోతున్నాయి. అన్నేసి కొత్త  జిల్లాలు వస్తే వాటితో పాటుగా జిల్లా పరిషత్తులు కూడా కొత్తవి వస్తాయి. అలా రాజకీయంగా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుంది. అధికారంలో ఉంది కాబట్టి వైసీపీకే జిల్లా పరిషత్తులు ఎక్కువగా వస్తాయి. అందువల్ల ఆ తతంగం కూడా పూర్తి అయ్యాకే  ఎన్నికలు అని వైసీపీ  అంటోంది. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 31తో పూర్తి అవుతుంది. ఆయన ఉండగా ఎన్నికలకు వెళ్ళకూడదని కూడా వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట. అందువల్ల అన్నీ చూసుకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ తరువాత మంచి ముహూర్తం చూసుకుని ఎన్నికలకు వైసీపీ రెడీ అంటుందంట. సో డౌట్లు తీరాయి కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: