విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్ మండి పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పవర్‌ గేమ్‌, కుల, మత రాజకీయాలు, గూండాయిజం తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని రామ్ ‌మాధవ్‌ విమర్శలు గుప్పించారు. ‘బికాజ్‌ ఇండియా కమ్స్‌ ఫస్ట్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించే సభలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విశాఖలో జరిగింది. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం వాటి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు.

ఇక్కడ మూడు రాజధానుల వివాదం, ఆలయాల కూల్చివేతలు తప్పితే మరో విషయంపై ఎవరూ శ్రద్ధ పెట్టడం లేదని, ప్రజల సమస్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదని, గొడవలు తప్పితే అభివృద్ధి ఎక్కడా రనిపించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీ ఇచ్చారనే అహంకారంతో.. అధికార పార్టీ చాలా ప్రమాదకరంగా వ్యవహరిస్తోందంటూ వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అనవసర విషయాలను, వివాదాలను పక్కన పెట్టి ప్రభుత్వం.. అభివృద్ధి దిశగా ఆలోచనలు చేయాలని సూచించారు.

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. కొవిడ్‌ కారణంగా స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం సరైన విధానం కాదని చురకలేశారు. కోర్టులు ఇచ్చే తుది తీర్పును గౌరవించాలని, దానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే ప్రజా స్వామ్యం బలహీనంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై వస్తున్న వ్యతిరేకత గురించి కూడా ఆయన మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని కొంత మందే శాసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారి నియంత్రణ నుంచి రైతులను తప్పించడానికే కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. ఈ సంస్కరణలకు సహకరించాలని, రైతులు ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: