జెనీవా: భూమిపై మానవాళి ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొటున్న విషయం తెలిసిందే. కానీ భవిష్యత్తులో ఓ ఘోరమైన సమస్య ప్రపంచంలోని దాదాపు 50 శాతం మందిని ఇబ్బంది పెట్టనుందట. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ప్రపంచ జనాభాలో 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడే ప్రమాదం ఉందని  డబ్ల్యూహెచ్ఓ మంగళవారం హెచ్చరించింది. అంటువ్యాధులు, పుట్టుకతో వచ్చే లోపాలు, జీవనశైలిలో వచ్చిన మార్పులు వంటి కారణాలతో పాటు వివిధ సమస్యల వల్ల పిల్లల్లో వినికిడి లోపాలు తలెత్తే అవకాశం ఉందని, దీనివల్ల రాబోయే కాలంలో అనేకమంది ఇదే సమస్యతో బాధపడే ప్రమాదం ఉందని తెలిపింది.

డబ్ల్యూహెచ్‌ఓ తాజా నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడవుతోంది. ఈ క్రమంలనే వినికిడి లోపాల నివారణ చికిత్స కోసం అదనపు పెట్టుబడులు పెట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది. ‘వినికిడి లోపం వల్ల కమ్యూనికేషన్, విద్య, ఉపాధికి దూరమయ్యే ప్రమాదముంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి వినికిడి సమస్యలున్నాయి. 2050 నాటికి ఇది మరింత పెరిగి ప్రతీ నలుగురిలో ఒకరికి ఈ సమస్య ఏర్పడుతుంది.

రాబోయే మూడు దశాబ్దాల్లో వినికిడి లోపం ఉన్న వారి సంఖ్య ఒకటిన్నర రెట్టు పెరగవచ్చ’ని డబ్ల్యూహెచ్‌వో నివేదికలో వెల్లడించింది. ‘మరో ముఫ్ఫై ఏళ్లలో వినికిడి లోపం ఉన్నవారి సంఖ్య 1.5 బిలియన్ల నుచి 2.5 బిలియన్లకు పెరగవచ్చు. పేద దేశాల్లో వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నా.. వారికి చికిత్స చేసే నిపుణుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. ఈ సమస్యను అధికగమించాలంటే బహిరంగ ప్రదేశాల్లో శబ్దాన్ని తగ్గించడం, వినికిడి లోపం కలిగించే మెనింజైటిస్ వ్యాధులకు టీకాలు వేయడం ఒక్కటే మార్గమ’ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతిపాదించింది.

 పిల్లల్లో వినికిడి లోపాన్ని సులభంగా నివారించవచ్చని, దీనికోసం సమస్యను గుర్తించి పరిష్కరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయేసస్ తన నివేదికలో సూచించారు. అయితే దీనికోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని, అప్పుడు ఈ సమస్యను అధిగమించగలుగుతామని అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: