ముత్తూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ 71 ఏళ్ల జార్జ్ ముత్తూట్ నిన్న ఢిల్లీలోని తన నివాసంలో మరణించారు. ఏదో అనారోగ్యంతో మరణించారేమో అని అంతా అనుకున్నారు. కానీ.. ఒకరోజు ఆలస్యంగా ఆయన మరణానికి కారణం బయటకు వచ్చింది. ఆయన మరణానికి గల కారణాలను పోలీసులు శనివారం వెల్లడించారు. ముత్తూట్ గ్రూప్ చైర్మన్ మృతి సహజ మరణం కాదని.. ఆయన భవనం పైనుంచి పడి చనిపోయారని స్పష్టం చేశారు. జార్జ్ నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడని ఢిల్లీ పోలీసులు వివరించారు.

నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన జార్జ్ ను ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రికి తరలించారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని దిల్లీ పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటం పలు అనుమానాలకు తావిస్తోంది. జార్జ్ కేవలం ప్రమాదవశాత్తూనే కిందపడి మరణించారా.. దీని వెనుకు ఇంకా ఏమైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అనుమానాలకు కారణం లేకపోలేదు. ఎందుకంటే.. జార్జ్ ముత్తూట్‌ సతీమణి పేరు సారా జార్జ్‌. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు.  రెండో కుమారుడు 2009లో హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం  పెద్ద కుమారుడు జార్జ్ ఎం జార్జ్ ముత్తూట్ గ్రూఫ్ ఆఫ్ సంస్థలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు. చిన్న కుమారుడు అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్‌‌గా ఉన్నారు. గతంలో కుటుంబంలో ఓ వారసుడి హత్యకు గురికావడం.. ఇప్పుడు కుటుంబ పెద్ద భవనంపై నుంచి జారిపడటం.. అనుమానాలకు తావిస్తున్నాయి.

అయితే ప్రస్తుతానికి జార్జ్ మరణంపై ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదని దిల్లీ పోలీసులు చెబుతున్నారు. అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే తాము విచారణ జరిపి నిజాలు తేలుస్తామంటున్నారు. ఇక జార్జ్ విషయానికి వస్తే.. జార్జ్ ముత్తూట్ ఫిక్కీ జాతీయ కార్యవర్గ కమిటీలో సభ్యుడు. ఫిక్కీ కేరళ రాష్ట్ర కౌన్సిల్‌ ఛైర్మన్‌ కూడా. ఆయన 1000 కోట్లకు పైగా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. బంగారం మొదలు రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటళ్లు, విద్యా సంస్థలు ఇలా లెక్కలేనన్ని వ్యాపారాలు ఆయన నిర్వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: