ఎంపీ.. మెంబర్ ఆఫ్ పార్లమెంట్.. ఈ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక.. అందులో తమ సమస్యలు చెప్పమని జనం ఎన్నుకుని ఢిల్లీకి పంపిస్తారు జనం. కానీ.. ఎంపీగా ఎన్నికైన నేతలు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తున్నారు. మన సమస్యలపై మాట్లాడుతున్నారా.. పల్లీబఠానీ తింటూ కాలక్షేపం చేస్తున్నారా... తెలుగు రాష్ట్రాల నుంచి 42 మందిని లోక్‌ సభకు పంపుతున్నాం. మరి వారిలో ఎందురు మన సమస్యలను ప్రస్తావిస్తున్నారు.. ఎందరు కేవలం ఎంపీ హోదా అనుభవిస్తూ రాచబోగాలు వెలగబెడుతున్నారు..?


2019 ఎన్నికల తర్వాత పార్లమెంటులో అడుగు పెట్టిన తెలుగు ఎంపీల్లో మ‌ల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి బాగా మాట్లాడుతున్నారు. ఫైర్‌బ్రాండ్‌గా రాష్ట్ర రాజ‌కీయాల్లో పేరు ఉన్న రేవంత్ లోక్‌స‌భ‌లోనూ త‌న‌దైన ముద్రకు ప్రయ‌త్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ‌ద్రోహం కేసులు పెడుతున్న తీరుపై బ‌లంగా గ‌ళ‌మెత్తారు. ఢిల్లీలో రైతుల ఆందోళ‌న‌, దిశా ర‌వి అరెస్టుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిల‌దీశారు. జ‌మ్ము క‌శ్మీర్‌ను కేంద్ర పాలిత‌ప్రాంతంగా ప్రక‌టించిన త‌ర్వాత అక్కడి ప‌రిస్థితులు లోతైన అధ్యయ‌నంతో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


ఆ తర్వాత తెరాస లోక్‌స‌భ ప‌క్ష నేత నామా నాగేశ్వర‌రావు రైల్వే ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వైఫ‌ల్యంపై చుర‌క‌లు అంటించారు.  ప్రగ‌తిప‌థంలో దూసుకుపోతున్న తెలంగాణ‌కు నిధుల్లో కోత‌పెట్టడం, పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను అమ‌లుచేయ‌క‌పోవ‌డంపై చేవెళ్ల ఎంపీ  డాక్టర్ రంజిత్‌రెడ్డి సూటిగా ప్రశ్నల వ‌ర్షం కురిపించారు. వివిధ బిల్లుల‌పై మెద‌క్ ఎంపీ కొత్త  ప్రభాక‌ర్‌రెడ్డి, బి.బి.పాటిల్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌పై తెదేపా లోక్‌స‌భ ప‌క్ష నేత రామ్మోహ‌న్ నాయుడు చక్కటి ప్రసంగం చేశారు.


ఇక వైకాపా నుంచి యువ ఎంపీలు మార్గాని భ‌ర‌త్‌, కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌, లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు ఉన్నా రాణించాల‌నే త‌ప‌న వారిలో ఉన్నట్లు క‌న‌ప‌డ‌డం లేదు. రాజ్యస‌భ కేశ‌వ‌రావు, బండ ప్రకాష్‌, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకుమార్‌, విజ‌య‌సాయిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బ‌ల‌మైన వాణి వినిపించారు. జిల్లా ఖ‌నిజ ఫౌండేష‌న్ బిల్లుపై కేశ‌వ‌రావు, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబ‌డుల పెంపుపై బండ ప్రకాష్‌, ర‌వీంద్రకుమార్‌, పిల్లి సుభాష్ చంద్రబోస్‌, దిల్లీ అధికారాలు లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్‌కు క‌ట్టబెట్టే బిల్లుపై విజ‌య‌సాయిరెడ్డి మంచి వాద‌న‌లు వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: