చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు, రాష్ట్రపతిని కలసి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేశారు, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అభ్యర్థించారు. వాట్ నెక్ట్స్. తర్వాత ఏంటి..? ప్రస్తుతం బాబు ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు ఎవర్ని కలుస్తారు, ఏం మాట్లాడతారు అనే విషయాలపై అధికారిక సమాచారం లేదు కానీ.. ఢిల్లీలోని కేంద్ర మంత్రుల్ని బాబు కలుస్తారని తెలుస్తోంది. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు దొరకలేదని ఓవైపు వైసీపీ సెటైర్లు వేస్తున్నా.. టీడీపీ టీమ్ మాత్రం ఈ విషయంపై గుంభనంగా ఉంది.

నిజంగానే చంద్రబాబు బీజేపీ పెద్దల్ని కలిస్తే ఏపీ భవిష్యత్ రాజకీయాలపై ఓ క్లారిటీ వచ్చేసినట్టే లెక్క. పర్యటనల్లో బిజీగా ఉన్న కేంద్ర మంత్రులు చంద్రబాబుకి అపాయింట్ మెంట్ ఇస్తే, ముఖ్యంగా అమిత్ షా అపాయింట్ మెంట్ దొరికితే మాత్రం టీడీపీకి మోరల్ సపోర్ట్ దొరికినట్టే లెక్క. అదే సమయంలో వైసీపీ సెటైర్లకు కూడా ఫుల్ స్టాప్ పడినట్టు అవుతుంది.

గతంలో బీజేపీనుంచి విడిపోయిన తర్వాత ఇప్పటి వరకూ ఆపార్టీ నేతలతో బాబు కలిసింది లేదు. మోదీ సహా ఇతర పెద్దలపై గతంలో తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు మాటతీరు ఇటీవల చాలా మారింది. కేంద్రంపై ఆయన సానుకూల ధోరణితో ఉన్నారనే విషయం చాలా సార్లు స్పష్టమైంది. ఈ సమయంలో ఢిల్లీలో ఉన్న చంద్రబాబు ఎవరెవరితో మాట్లాడతారు.. ఏం మాట్లాడతారు అనేది ఆసక్తిగా మారింది. ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలపై ఫిర్యాదుల సంగతి సరే సరి. మరి ఏపీ భవిష్యత్ రాజకీయాలపై కూడా చర్చ జరుగుతుందా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలసి ఉన్నాయి, టీడీపీ ఒంటరి. 2024లో వైసీపీని ఎదుర్కోవాలంటే మూడు పార్టీలు కలసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. అదే నిజమైతే.. ఆయా పార్టీల కలయికకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనే వేదిక అవుతుంది. కేంద్ర పెద్దల భేటీ తర్వాత చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందనే విషయంపై భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: