ఏపీలో అధికార వైసిపిలో నేతల మధ్య కుంపట్లు రాజుకుంటున్నాయి. పలు జిల్లాల్లో మంత్రులకు ఎమ్మెల్యేలకు - ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఏ మాత్రం పడటం లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తోంది. మరికొన్నిచోట్ల సీనియర్ నేతలకు , ఎమ్మెల్యేలకు పడటం లేదు. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీలు త‌మ‌ను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన ఓ మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య యుద్ధం నడుస్తోంది. కొవ్వూరు ఎమ్మెల్యే గా ఉన్న తానేటి వనిత‌ గోపాలపురం నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తానేటి వనిత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గోపాలపురం ఎమ్మెల్యే గా ఘన విజయం సాధించారు. అయితే ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో కొవ్వూరు లో పోటీ చేసి ఓడిపోయిన ఆమె 2019 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించి జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అయితే ఆమె సొంత నియోజకవర్గం గోపాలపురం.

వ‌నిత తండ్రి జొన్న‌కూటి బాబాజీ రావు సైతం గ‌తంలో గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తమకు ప‌ట్టున్న‌ నియోజకవర్గం కావడంతో గోపాలపురం నియోజకవర్గ రాజకీయాల్లో వ‌నిత‌, ఆమె తండ్రి జోక్యం చేసుకోవడంతో పాటు అక్కడ తన బలమైన వ‌ర్గం ఏర్పరచుకుంటున్నారు.

ఇక వ‌నిత తండ్రి బాబాజీ రావు సైతం వచ్చే ఎన్నికల్లో వనిత కొవ్వూరు నుంచి కాకుండా గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అనుచ‌రులకు ఏమాత్రం రుచించడం లేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఇక్కడ నుంచి ఆమె ఎలా పోటీ చేస్తారని కారాలు .. మిరియాలు నూరుతున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జిల్లా వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: