అది 2013 ఆగస్టు 14 వ తేదీ సాయంత్రం నాలుగైదు గంటల మధ్య సమయం. మద్రాసు నగరంలోనిరాజ్ భవన్ రోడ్డులో ఉన్న గవర్నర్  కార్యాలయం వెలుపల నెలకొన్న వాతావరణం గొప్ప వేడుకలను తలపించింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం లోని ఆ ప్రాంతం ఆ సమయంలో ఓ మినీ భారత్ లా ఉంది. అక్కడ గుమికూడిన వారిలో వివిధ రాష్ట్రాల ప్రజలున్నారు. వారి వేషధారణ అంతా తమ సొంత ప్రాంత  ఆచార వ్యవహార శైలిని  ప్రతిబింబిస్తోంది. అక్కడ జరగే విశేషాలను కవర్ చేయడానికి వివిధ పత్రికలు, ఛానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.   కార్యక్రమం మొదలు కావడానికి ఇంకా గంటన్నర సమయం ఉంది.  యావత్ భారత దేశం మరికొద్ది గంటల్లో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడు గవర్నర్ అందరికీ విందు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ప్రదాయంగా  నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారంతా అక్కడికి విచ్చేశారు.
గవర్నర్ కార్యాలయ  సిబ్బంది ఒకరు నెమ్మదిగా  పాత్రికేయులున్న ప్రాంతానికి  ఓ చిన్న సందేశం తీసుకు వచ్చారు.  తనకు పరిచయం ఉన్న సీనియర్ పాత్రికేయుని వద్దకు వచ్చి  తెలుగు పాత్రికేయులను గవర్నర్  సార్ రమ్మంటున్నారు. ఎలాంటి శబ్దం చేయకుండా గుట్టుగా లోనికి రండి అని చెప్పి లోనికి వెళ్లి పోయారు. దీంతో తెలుగు పాత్రికేయులంతా  లోపలికి వెళ్లారు. నాటి తమిళనాడు గవర్నర్ గా ఉన్న వ్యక్తి కొణిజేటి రోశయ్య. ఆయన అందరినీ చిరునవ్వుతో పలుకరించారు. చాలా మంది సీనియర్ పాత్రికేయులను కుశల ప్రశ్నలు వేశారు. ఏం సూర్య ప్రకాశ రావు ఎలా ఉన్నావు ? ఏం నర్సిం నీ కార్టూనులు చాలా బాగుంటాయయ్యా.. మరీ అంత ఏకి  పారేస్తే ఎట్లా ? కాస్తా చూసి పో..  ఏం వెన్నెల కంటి ఇంతకీ  ఎప్పుడు పెళ్లిచేసుకుంటావయ్యా ? అంటూ తనకు పరిచయం ఉన్న పాత్రికేయమిత్రులను పేరు పేరునా పలుకరించారు. ప్రస్తుతం మీరూ, నేనూ ఒకటే నయ్యా అందరూ మాతృభూమికి దూరంగా ఉన్నాం. కాస్త అప్పుడప్పుడూ కనిపిస్తుూ ఉండండి...   అంటూ తెలుగు  మీడియా సిబ్బందితో దాదాపు గంటకు పైగా గడిపారు.  తనకు ఏ మాత్రం అవకాశం ఉన్నా తెలుగు వారి  ఇంట జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే వారు. చెన్నై నగరానికి దాదాపు వంద కిలో మీటర్లు దూరంలో ఉన్న సూళూరు పేటకు తరచుగా వచ్చే వారు.   చెన్నై నుంచి రోడ్డు మార్గాన ఆంధ్ర ప్రదేశ్ కు రోడ్డు మార్గాన వెళుతున్న సమయంలో ఖచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులోని సూళ్లూరు పేటలో ఆగే వారు.  రోశయ్యకు, సూళ్లూరు పేటతో అవినావ భావ సంబంధం ఉంది. ఆ ఊరి వాస్తవ్యుడు ఐతా ఆనంద కృష్ణయ్య , కొణిజేటి రోశయ్యకు అత్యంత సన్నిహిత మిత్రుడు.  ఇద్దరికీ దాదాపు  యాభై సంవత్సరాలకు పైగా   స్నేహితం.  రాజకీయాలకు అతీత మైన బాల్యస్నేహితం కావడంలో ఎక్కడ కలిసినా అరమరికలు లేకుండా మాట్లాడుకునే వారు.  సూళ్లూరు పేట వచ్చిన సమయంలో రోశయ్య స్థానిక పాత్రికేయులతో సంభాషించే వారు, కానీ వార్తలు రాయడాన్ని మాత్రం సున్నితంగా తిరస్కరించే వారు. ఆనంద కృష్ణయ్య సూళ్లూరు పేట వదలి బైటికి రాడు. నేనేమో తరచుగా సూళ్లూరు పేట రాలేను.  మా ఇద్దరికీ దొరికిన కాసేపు అయినా హాయిగా మాట్లూడు కోనివ్వండి అని రోశయ్య్ చెప్పేవారు. ఆనంద కృష్ణయ్యతో ఉన్న చనువు రీత్యా కావచ్చు... తనకు ఇష్టమైన పదార్ధాలను రోశయ్య అడిగి మరీ చేయించునే వారు. కొణిజేటి వివాదాలుకు దూరంగా ఉండే వ్యక్తి మాత్రమే కాదు,  మిత భాషి, నిగర్వి, అన్నింటినీ మించిన స్నేహశీలి.





మరింత సమాచారం తెలుసుకోండి: