గడపదాటి బైటికి రాని నేత ఒకరు... తరచుగా విదేశీ ప్రయాణాలు చేస్తుంటారని పేరు తెచ్చుకున్న నేత మరోకరు.  ఒకరేమో అగ్రరాజ్యాధినేత... మరోకరు అగ్రరాజ్యంగా ఎదుగుతున్న దేశానికి ప్రధాన మంత్రి. వీరిద్దరూ కేవలం నాలుగు గంటల పాటు సమావేశం కానున్నారు. కానీ యావత్ ప్రపంచం వీరిద్దరి సమావేశం పైనే దృష్టి సారించి ఉండటం గమనార్హం.
భారత్ కు మిత్ర దేశం ఏది అని మా దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో అడిగినా, చివరకు బడికి వెళ్లే  చిన్నారులను అడిగానా ఠక్కున సమాధానం వస్తుంది. వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా ? ఆ పేరే రష్యా.. అని భారత దేశ ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాల క్రితం తన రష్యా పర్యటనలో పేర్కోన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రష్యా దేశ సహాయ సహకారాలను భారత్ స్వీకరించింది. రెండు దేశాల మధ్య దశాబ్దాల పాటు స్నేహ బంధాలు వెల్లివిరిశాయి కూడా. భారత్ లోని అన్ని పార్టీల నేతలకు రష్యా లోని నేతలతో వ్యక్తిగత స్నేహ సంబంధాలున్నాయంటే  ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉన్నాయో మనం గ్రహించ వచ్చు. భారత్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రష్యాతో స్నేహబంధం నిరాటంకంగా కొనసాగింది.
ఇటీవలి కాలంలో  భారత్ రష్యాకు దూరమవుతున్నదా ? అన్న అనుమానాలు రేకెత్తాయి. దీనికి చాలా కారణాలున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ఆదేశం చాలా ఒడుదుడుకులకు లోనైంది. ఆ సమయంలో భారత్-  రష్యాకు అండగా నిలిచింది కూడా. బారత్ లో కాంగ్రెస్ పార్టీ  కి  చెందిన ప్రధాన మంత్రి , తెలుగు తేజం పి.వి. నరసింహా రావు పదవీ కాలంలో ఈ స్నేహబంధాలు బీటలు బారడం ఆరంభించాయి. ఇందుకు కారణం నాడు భారత్ ప్రపంచీకరణ , సరళకరణ ఆర్థిక విధానాలను అవలంబించడమే. దీంతో ఇరు దేశాల మధ్య కొంత గ్యాప్ పెరిగింది. దీంతోబాటు అంతర్జాతీయ సమాజం ప్రభావం కూడా భారత్ పై  పడింది. ఒక దశలో భారత దేశంచాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితిని పరోక్షంగా కల్పించింది. అదేమిటంటే....తాలిబన్లు మంచి వారని, సమర్థవంతమైన పాలకులని కితాబిచ్చింది. దీంతో దక్షిణాసియాలో  పరోక్షంగా పాకిస్తాన్ సమర్థవంతం చేసినట్లుయింది. దీంతో భారత్ పరోక్షంగా ఆచీ తూచీ వ్యవహరించాల్సిన   స్థితి ఏర్పడింది.
తాజాగా భారత్- రష్యాలు రెండూ కూడా ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గోంటున్నాయి. ఇందుకు ఢిల్లీ నగరం వేదిక కానుంది.  రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు భారత్ కు వస్తారు. సమావేశం పూర్తి కాగానే, భారత ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేైంద్ర మోడీ ఇచ్చే విందుకు హాజరవుతారు. తదుపరి రాత్రి 9.30 గంటలకు తిరిగి మాస్కో వెళతారు. ఈ విషయాన్ని ఇరుదేశాల  రాయభారులూ  ప్రకటించారు . దీంతో ఈ నాలుగు గంటల సేపు ఏం జరగనుందో నని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం రష్యా - భారత్ లమధ్య వ్యాపార సంబంధాల విలువ 75 వేల కోట్లు మాత్రమే. దీనిని మరింతగా పెంచుకోవాలన్నదే ఇరుదేశా లక్ష్యం. రానున్న నాలుగైదేళ్ల లో ఈ వ్యాపార సంబంధాల విలువ రెండు లక్షల కోట్లు పై చిలుకు మొత్తానికి పెంచుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: