సరిహద్దులో చైనా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో  మోడీ ప్రభుత్వం సీడీఎస్‌ను నియమించేందుకు సిద్ధమ‌వుతున్న‌ది. మరోవైపు ఇప్పటి వరకు సీడీఎస్‌గా ఉన్న బిపిన్‌ రావత్  నిన్న అక‌స్మాత్తుగా హెలికాప్ట‌ర్  ప్ర‌మాదంలో మృతి చెందడంతో నూత‌న‌ సీడీఎస్‌గా ఎవరూ వస్తారనే దానిపై చర్చ మొద‌లైంది.  బిపిన్ రావ‌త్ మ‌ర‌ణంతో దేశంలో విషాద‌క‌రమైన‌ ప‌రిస్థితులు ఉన్నా.. రక్షణ విష‌యంలో ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని ప్రధాని మోడీ భావించార‌ని స‌మాచారం. నిన్న జ‌రిగిన క్యాబినేట్ స‌మావేశంలో కూడా ఈ విషయం పై చర్చించార‌ని తెలుస్తోంది.  అయితే త్రివిధ ద‌ళాల‌కు కొత్తగా ఎవ‌రినీ అధిపతిని చేయాలనే నిర్ణయంలో ప్రభుత్వ పెద్దలు సందిగ్ధంలో ఉన్నారు.

 త్రివిధ ద‌ళాల‌కు నూత‌న బాస్ గా ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వణేను ఎంపిక చేసే అవ‌కాశాలు  ఉన్నాయ‌ని ప్రస్తుతం చర్చ జరుగుతున్న‌ది. గ‌తంలో బిపిన్ రావత్ కూడా ఆర్మీ చీఫ్‌గా చేసిన త‌రువాత‌నే సీడీఎస్‌గా ఎంపికయ్యారు.  అదేవిధంగా ప్రస్తుతం వైస్ సీడీఎస్‌గా ఉన్న ఎయిర్ మార్షల్‌ రాధాకృష్ణ ను కూడా సీడీఎస్ గా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్న‌దని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.  

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ త‌మిళ‌నాడులోని కున్నూరు ప్రాంతంలో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో నిన్న మృతి చెందిన విష‌యం విధిత‌మే. ఈ  ప్ర‌మాదంలో రావ‌తి భార్య మ‌ధులిక‌తో పాటు మొత్తం 13 మంది మృత్యువాత‌ప‌డ్డారు. ఇవాళ రావ‌త్ దంప‌తుల పార్థివ దేహాల‌ను ఢిల్లీకి త‌ర‌లించ‌నున్నారు. ఆ త‌రువాత ప‌లువురు ప్ర‌ముఖులు, ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచిన త‌రువాత రేపు సాయంత్రం వ‌ర‌కు ఢిల్లీలో  అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఢిల్లీలో రేపు కామరాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్‌లోని ఆర్మీ క్రిమియేషన్ గ్రౌండ్ వ‌ర‌కు అంతిమ యాత్ర కొన‌సాగించి.. సీడీఎస్ బిపిన్ రావ‌త్‌తో పాటు ఆయన భార్య అంత్యక్రియలు  నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావత్‌తో పాటు ఆయన అర్థాంగి మధులికా రావత్‌తో పాటు ఇతర రక్షణ సిబ్బంది కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపి.. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌క‌టించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: