
ఇక కర్నూలు జిల్లాలో సైతం తమ్ముళ్ళ మధ్య పెద్ద పంచాయితీనే నడుస్తోంది. మామూలుగానే జిల్లాలో టీడీపీకి పట్టు ఉండదనే సంగతి తెలిసిందే. అలాంటప్పుడు పార్టీ నేతలు ఐకమత్యంగా ఉంటూ...ఇంకా గట్టిగా కష్టపడి వైసీపీని ఎదురుకోవాల్సి ఉంటుంది. కానీ టీడీపీ నేతలు చేయరు. వారిలో వారే పంచాయితీలు పెట్టుకుని రచ్చ చేస్తూ ఉంటారు. దీని వల్ల పార్టీకే డ్యామేజ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల జిల్లాలో కోట్ల, కేఈ ఫ్యామిలీల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. మొదట నుంచి కోట్ల, కేఈ ఫ్యామిలీలకు పెద్దగా పడదనే విషయం తెలిసిందే. కోట్ల ఫ్యామిలీ కాంగ్రెస్‌లో, కేఈ ఫ్యామిలీ టీడీపీలో ఉంటూ దశాబ్దాల పాటు రాజకీయ యుద్ధం చేస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల ముందు కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది. దీంతో నేతలు కలిసిపోతారు అనుకున్నారు...కానీ వారు కలవలేదు.
ఇప్పటికే ఆ రెండు ఫ్యామిలీల మధ్య రచ్చ నడుస్తోంది. పైగా ఇటీవల కేఈ ఫ్యామిలీ చేతిలో ఉండే డోన్ బాధ్యతలని కోట్ల సూర్యప్రకాశ్ సన్నిహితుడు సుబ్బారెడ్డికి అప్పగించారు. దీంతో కేఈ ప్రభాకర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే కోట్ల సూర్యప్రకాశ్ భార్య సుజాతమ్మ ఇంచార్జ్‌గా ఉన్న ఆలూరులో ప్రభాకర్ వేలు పెడుతున్నారు. అలాగే కర్నూలు ఎంపీ సీటులో పోటీ చేస్తానని చెప్పి కోట్లకు పరోక్షంగా షాక్ ఇస్తున్నారు. ఇలా ఒకే పార్టీలో ఉన్న కోట్ల, కేఈ ఫ్యామిలీల పంచాయితీ మరి ముదురుతుంది. దీని వల్ల టీడీపీకే పెద్ద డ్యామేజ్ అయ్యేలా ఉంది.