ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల గడువుంది. ఇంకా చెప్పాలంటే... ప్రసుత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దాదాపు సగం గడువు ఇంకా ఉంది. కానీ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. ఇందుకు రకరకాల కారణాలు, పుకార్లు వినిపిస్తున్నాయి కూడా. చివరికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జనవరి ఒకటో తేదీన రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో ఏడాదిన్నర ముందు నుంచే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మూడ్‌లోనికి వెళ్లిపోయాయి. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు తమ అభ్యర్థుల వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి కొందరైతే... ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరివో అంటూ సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఇక ప్రధాన పార్టీలు అయితే... పొత్తులపై దృష్టి సారించాయి కూడా. ఈ నేపథ్యంలో రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడించారు ఉండవల్లి. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కూడా ఉండవల్లి తేల్చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 2024 ఎన్నికల వరకూ తీసుకెళ్లాల్సి ఉందన్నారు కూడా. కరోనా వైరస్ నేపథ్యంలో... పరిస్థితులకు అనుగుణంగా జగన్ సర్కార్ పరిపాలన కొనసాగుతోందన్నారు మాజీ ఎంపీ. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో... ప్రజలకు ఆర్థికంగా చేయూత ఇవ్వడంలో జగన్ సర్కార్ ముందు వరుసలో ఉందని కితాబిచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రజలకు ఏదో ఒక రూపంలో ఆర్థికంగా అండగా నిలవాలనేది ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వేత్తల సూచన అని ఉండవల్లి గుర్తు చేశారు. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి బయట పడటానికి ప్రజలకు ఆర్థికంగా చేయూతను అందించాల్సి ఉంటుందని ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న ఆమర్త్యసేన్, రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారని ఉండవల్లి గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అదే పని చేస్తోందన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందన్నారు ఉండవల్లి.


మరింత సమాచారం తెలుసుకోండి: