పీఆర్సీ వివాదంపై చేయాలని అనుకున్న సమ్మెను ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరమించుకున్నారు. అయితే వీళ్ళు సమ్మెను విరమించుకోవటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఎల్లోమీడియాకు ఏమాత్రం రుచిస్తున్నట్లు లేదు. వీళ్ళ ఉద్దేశ్యంలో సమ్మె తీవ్రరూపం దాల్చాలి. పోలీసులు లాఠీలకు పనిచెప్పాలి. ఉద్యోగుల నేతలను, ఉద్యోగులను అరెస్టు చేసి జైళ్ళల్లో తోయాలి. అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తి రాష్ట్రం అల్లకల్లోలం కావాలన్నట్లుగా ఉంది.
కానీ వీళ్ళ ఆలోచనలతో కోరికతో సంబంధంలేకుండానే సమ్మె విరమించటాన్ని పవన్, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. అందుకనే ఉద్యోగులను, ఉపాధ్యాయులను రెచ్చగొట్టేపని పెట్టుకున్నారు. ఉద్యోగులను ఒత్తిడిలోకి నెట్టేసి తాము చెప్పినట్లు వినేలా ప్రభుత్వం ఉద్యోగుల నేతలను కార్నర్ చేసేసిందంటు పవన్ తెగ బాధపడిపోయారు. ఉద్యోగులు తనమాటే వినాలని, చర్చల్లో తనదే పైచేయి కావాలని ప్రభుత్వం కోరుకోవటం తప్పెలా అవుతుందో పవనే చెప్పాలి.
ఉద్యోగులను దారికి తెచ్చుకోవటానికి, సమ్మె విరమింపచేయటానికి ప్రభుత్వం సామ దాన బేధ దండోపాయాలను అనుసరిస్తుంది. అదంతా పాలకుల చాతుర్యం మీద ఆధారపడుంది. రాష్ట్రంలో ఏదో జరగబోతోందనే పరిస్ధితి నుండి సమ్మెను విరమించుకుంటున్నట్లు ఉద్యోగుల సంఘం నేతలతోనే చెప్పించటం జగన్మోహన్ రెడ్డి చాతుర్యానికి తాజా ఉదాహరణ. ఇంతోటిదానికి పవన్ గగ్గోలు పెట్టాల్సిన అవసరమేలేదు. ఎవరిని ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని జగన్ అనుకుంటున్నారు. తాను అనుకున్నట్లుగానే తన అజెండాతో వెళుతున్నారు.
సమ్మె విరమింపచేయటంలో ప్రభుత్వం నాలుగు మెట్లు దిగొచ్చింది. అలాగే ఉద్యోగుల నేతలు కూడా కొన్నిమెట్లు దిగారు. ఫలితంగా సమ్మెను విరమించుకున్నట్లు నేతలు ప్రకటించారు. ఇందులో ఉద్యోగుల నేతలను ఒత్తిడికి గురిచేసి కృతజ్ఞతలు చెప్పించుకుందని పవన్ గోలేమిటో అర్ధం కావటంలేదు. ఉద్యోగుల నేతలు ఒత్తిడికి లొంగిపోయే వాళ్ళే అయితే సమ్మె అసలు ఇంతదూరం వచ్చుండేదే కాదు. అయినా సమ్మె విరమించుకోవటం పవన్ , ఎల్లోమీడియాకు ఏమాత్రం రుచించటం లేదని వాళ్ళ మాటలు, రాతలను బట్టే అర్ధమైపోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి