ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిపైన బురదచల్లాలని ఆలోచన చేస్తున్న తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రయత్నాన్ని చివరకు కోర్టే అడ్డుకున్నది. పోలీసులు, అరెస్టులు, కేసులంటు కోర్టులో ఎంపీ వేసిన కేసును కోర్టు కొట్టేసింది. ఊహాజనితమైన కారణాలతో వేసే కేసులపై తాము స్పందించేదిలేదని కోర్టు తేల్చిచెప్పేసింది. దాంతో నరసాపురంలో హెవీ సెక్యూరిటితో అడుగుపెట్టి తన కెపాసిటి చూపించి షో చేద్దామని అనుకున్న తిరుగుబాటు ఎంపీ పప్పులుడకలేదు.




 



భీమవరం పర్యటన సందర్భంగా తనపై కేసులు నమోదుచేసి అరెస్టుచేయకుండా పోలీసులను ఆదేశించాలన్న ఎంపీ వాదనను కోర్టు కొట్టేసింది. అంతకుముందు ఇదే విషయమై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ను కలిసినా, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిసినా ఉపయోగం కనబడలేదు. హోంశాఖను కలిసినపుడు ఉపయోగం కనబడలేదనే ఎంపీ కోర్టులో పిటీషన్ వేశారు.






అయితే రెండువైపులా వాదనలు విన్న తర్వాత కోర్టు కూడా ఎంపీ వాదనతో ఏకీభవించలేదు. పిటీషనర్ కు ఇప్పటికే జడ్ క్యాటగిరి ఉంది కాబట్టి ప్రత్యేకించి లోకల్ పోలీసుల నుండి రక్షణ ఇచ్చేట్లుగా ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరంలేదని చెప్పేసింది. ఒకవేళ పోలీసులు కేసులు పెట్టినా, అరెస్టు చేయాలని అనుకున్నా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని మాత్రమే ఆదేశించింది. ఎంపీకి కేంద్రబలగాల భద్రత ఉన్నా మళ్ళీ రాష్ట్రంలో రక్షణగా నిలవాల్సింది మాత్రం లోకల్ పోలీసులే అని ఎంపీ తరపున లాయర్ ఎంతచెప్పినా కోర్టు వినిపించుకోలేదు.







ఎంపీ విషయంలో తొందరపాటు చర్యలొద్దనే ఆదేశాలు గతంలో ఓ కేసు విషయంలోనే ఆదేశాలిచ్చిన కారణంగా ఇపుడు కొత్తగా మళ్ళీ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు వైఖరి చూసిన తర్వాత ఎంపీకి కోర్టులో కూడా ఎదురుదెబ్బే తగిలిందన్న విషయం అర్ధమైపోతోంది. ఎందుకీ పరిస్ధితి వచ్చింది ? ఎందుకంటే ఎంపీ మీద కేసులు పెడతామని కానీ అరెస్టు చేస్తామని కానీ ఎవరు చెప్పలేదు.



ఎంపీని అరెస్టుచేయటానికి పోలీసులేమీ కాచుకుని కూర్చోలేదు. పోలీసుల నుండి ఎలాంటి చర్యలు, హెచ్చరికలు లేకపోయినా తనంతట తానే ఏదేదో ఊహించేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ నానా గోల చేస్తున్నారన్న అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ వాదనలతో కోర్టు ఏకీభవించినట్లే ఉంది. అందుకనే ఎంపీ వాదనను కోర్టు కొట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: