తొందరలో ఎన్నికలు  జరగబోతున్న ఏపీపైనే అక్క ప్రియాంకగాంధి, తమ్ముడు రాహుల్ గాంధిలు దృష్టి పెట్టబోతున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు తెలంగాణా ఎన్నికల బిజీలో ఉన్న వీళ్ళిద్దరు తరచూ ఏపీ నేతలతో భేటీలు అవుతున్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందుకనే వీళ్ళు విజయవాడ ఎయిర్ పోర్టులో దిగి అక్కడ నుండి ఖమ్మం, నల్గొండ చేరుకుంటున్నారు.

హైదరాబాద్ నుండి నల్గొండ, ఖమ్మంకు బై రోడ్డు చేరుకోవటం కన్నా విజయవాడ నుండి చేరుకోవటం దగ్గిర. పైగా విజయవాడ ఎయిర్ పోర్టులో కాసేపు ఏపీ నేతలతో కూడా మాట్లాడచ్చన్నది వీళ్ళ ఆలోచన. అందుకు తగ్గట్లే ఎయిర్ పోర్టులోనే ఏపీ కాంగ్రెస్ నేతలతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో  మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగబోతున్న ఏపీ విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కా, తమ్ముళ్ళిద్దరు అమరావతి రాజధానినే కీలక అంశంగా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. గడచిన రెండు ఎన్నికల్లో ఏపీ ఎన్నికలను వీళ్ళు పట్టించుకోలేదు.


రాజధానిగా అమరావతిని ఎలక్షన్ అజెండాగా చేసుకోవాలని ఇప్పటికే వీళ్ళిద్దరు ఏపీ అధ్యక్షుడు గిడుగు రాద్రరాజుతో పాటు సీనియర్లందరికీ చెప్పారు. మరి ఎన్నికల ప్రచారంలోకి దిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిపైన ఏ విధంగా ఆరోపణలు, విమర్శలు చేస్తారన్నది చూడాలి. ఇపుడు తెలంగాణా ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీని కూడా ప్రియాంక, రాహుల్ పదేపదే టార్గెట్ చేస్తున్న విషయం చూస్తున్నదే. అయితే ఏపీలో కూడా అలాగే జగన్, చంద్రబాబును టార్గెట్ చేస్తారా అన్నదే పాయింట్.

జగన్ను టార్గెట్ చేస్తారు కానీ టీడీపీని టార్గెట్ చేసే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు టీడీపీ మద్దతుస్తున్న విషయం చూస్తున్నదే. తెలంగాణాలో టీడీపీ మద్దతు తీసుకుని ఏపీలో చంద్రబాబును కాంగ్రెస్ టార్గెట్ చేయగలదా ? టీడీపీని టార్గెట్ చేయలేకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా చేయలేరు. ఇక మిగిలింది బీజేపీ ఒకటే. ఆ పార్టీని టార్గెట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. చూస్తుంటే కాంగ్రెస్+వామపక్షాలు కలిసి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా అక్కా, తమ్ముళ్ళు ఏపీపై ఈసారి గట్టిగానే దృష్టిపెట్టేట్లుగా ఉన్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: