- కోటి మంది మహిళలకు ప్రతి నెలా రు. 1500
- స్కూల్‌కు వెళ్లే ప్రతి పిల్లాడికి రు. 15 వేలు... ఇన్ని కోట్లు ఎక్కడ నుంచి తెచ్చేనో..!
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
చంద్రబాబు ప్రభుత్వానికి కీలకమైన నాలుగు పథకాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే వీటిని అమలు చేయాలంటే నిధులు లేవు. అమలు చేయకుండా ఉందామంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో ఆయా పథకాలను ఏం చేయాలి? ఎలా అమలు చేయాలి వాటిని ఇంకా వాయిదా వెయ్యాలా? లేక... వీటిపై ప్రజల నుంచి వివరణ కోరాలా అనే విషయంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. తాజాగా ఇటీవల అత్యంత రహస్యంగా జరిగిన అధికారుల సమావేశంలో కీలకమైన 4 పథకాలు చంద్రబాబు ప్రస్తావించారు.
వీటి అమలకు నిధులు ఎంత ఉన్నాయి? ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి ఏమేరకు సహకరిస్తుంది ? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? అనే సమగ్ర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. ప్రధానంగా అమ్మకు వందనం కింద ప్రతి ఇంట్లో ఉన్న పాఠశాలకు వెళ్లే పిల్లలకు 15 వేల రూపాయలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇంట్లో ఇద్దరు ఉంటే 30000, ఒకరే ఉంటే 15000.. ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామని చంద్రబాబు ప్రకటన చేశారు. ఇది ఎన్నికల సమయంలో ఆయనకు ఓట్లు రాబట్టిందనేది వాస్తవం.
కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉండటం, ఏటా వేలాది రూపాయలను వాళ్ళకి ఇవ్వాల్సి రావడంతో ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తే ఖజానా మరింత ఖాళీ కావడం ఖాయం అని తెలుస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల మాదిరిగానే ఇప్పుడు తాను కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, దీనివల్ల ప్రతిపక్షాలకు మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
రైతు భరోసా
ఇదే సమయంలో ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20 వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పట్లో రైతులకు 13 వేల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. దీనిలో కేంద్రం వాటా కింద 6000 పోగా మిగిలిన సొమ్మును ఆయన అందించారు, అయితే దీనిని ఏకంగా 20,000 చేయడం ద్వారా చంద్రబాబు రైతులకు మేలు చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పుకొచ్చారు, పోనీ కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ యోజన నిధులు పెంచిందా? అంటే పెంచలేదు. కేంద్రం ఇస్తున్న ₹2000 కొనసాగిస్తుంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏడాదికి 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగిలిన 12 వేల రూపాయలను కలిపి ఇప్పుడు చంద్రబాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కూడా నిధులు లేని పరిస్థితి చంద్రబాబును పట్టిపీడిస్తోంది.
ప్రస్తుతం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా రైతుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల వరకు ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 22 లక్షల మందికి ఇవ్వగా ఇప్పుడు ఒక రెండు లక్షల మందిని తీసేసినా 20 లక్షల మందికి రైతు భరోసా కింద నిధులు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అయినా నిధులు విడుదల చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ పథకంపై కూడా చంద్రబాబు సమస్య ఎదుర్కొంటున్నారు. ఎంతమంది రైతులన్నారు? ఎంతమందికి ఇవ్వాలి? అనేది ఆయన ఆలోచిస్తున్నారు.
నెలనెలా 1500
కీలకమైన మరో పథకం మహిళలకు ప్రతినెల 1500 రూపాయలు. ఎన్నికలకు ముందు చంద్రబాబు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 1500 రూపాయల నెల నెలా ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ ఎన్నికల సమయంలో బాగా వర్కౌట్ అయింది. యువతల నుంచి మహిళల వరకు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు దీనికి కూడా నిధుల సమస్య వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలు ఉంటే వారిలో కేవలం 32 లక్షల మంది మాత్రమే పింఛన్లు తీసుకుంటున్నారు. అంటే మీరు సామాజిక భద్రత పథకంలో.. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువుల పరిధిలో నెలనెలా పింఛన్లు తీసుకుంటున్నారు.
వీరిని మినహాయిస్తే మిగిలిన కోటి 60 లక్షల మంది లేదా కోటి పది లక్షల మంది కనీసంలో కనీసం అర్హత పొందిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ కోటి మంది వరకు నెలకి 1500 చొప్పున ముఖ్యమంత్రి అందించాల్సి ఉంది. దీంతో ఈ పథకానికి కూడా నిధుల సమస్య వెంటాడుతుంది. దీనిపై కూడా తాజాగా చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ పథకంలో ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేకుండా పోవడం మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం ముఖ్యంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా ఉండడం అందరికీ ఇస్తానని హామీ ఇవ్వడం ఈ కారణంగా ఈ పథకం తలనొప్పిగా మారింది.
ఆర్టీసీ ఉచిత ప్రయాణం
ఇక, మరో ముఖ్య పథకం ఆర్టిసి బస్సులు. అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిపై అప్పట్లోనే అనేక తర్జన భర్జనలు పడ్డారు. పల్లె వెలుగులో ఫ్రీ కల్పించాలా? ఆర్టీసీ సిటీ బస్సుల్లో కల్పించాలా? లేదా రాష్ట్రవ్యాప్తంగా తిరిగే అన్ని బస్సుల్లోను కల్పించాలా? అనేదానిపై కూడా అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు తిరగవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే, ఇప్పటి వరకు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయాన్ని కార్నర్ చేస్తూ తాజాగా కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల ప్రశ్నలు అందించారు.
ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎంతవరకు అమలు చేయాలి? పల్లె వెలుగుకు మాత్రమే పరిమితం చేయాలా? లేదా అంతర్రాష్ట్ర పరిధిలో కూడా అమలు చేయాలనే విషయంపై చంద్రబాబు మథనపడుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు పథకాలు ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద సవాలుగా మారాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి