భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. మే 6-7 అర్ధరాత్రి భారత్.. పంజాబ్, ఆజాద్ జమ్మూ కశ్మీర్‌లోని అనేక చోట్ల మిస్సైల్, వైమానిక, డ్రోన్ దాడులు చేసింది. ఈ 'అకారణ దాడి'ని తీవ్రంగా ఖండిస్తూ, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మే 8న టీవీలో జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

షరీఫ్.. భారత్ చేసిన ఈ సైనిక చర్యను పెద్ద తప్పుగా పేర్కొన్నారు. దీనికి భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ 'అమరవీరుల ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని' ఆయన ప్రతిన పూనారు. పాకిస్థాన్ సైన్యం ఇప్పటికే తమ సత్తా చాటిందని, దేశం తనను తాను కాపాడుకోవడానికి పూర్తి సంకల్పంతో, సిద్ధంగా ఉందని షరీఫ్ తెలిపారు.

షరీఫ్ చెప్పిన దాని ప్రకారం, పాకిస్థాన్ వాయుసేన చాలా వేగంగా, సమర్థవంతంగా స్పందించి.. భారత దళాలను వెనక్కి తరిమి కొట్టింది. అంతేకాదు, ఈ ఎదురుదాడిలో భారత వాయుసేనకు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన వెల్లడించారు. "భారత సైనిక సత్తాకు ప్రతీకగా భావించే ఈ విమానాలు ఇప్పుడు తుక్కుతుక్కు అయ్యాయి" అని షరీఫ్ వ్యాఖ్యానించారు. "పాకిస్థాన్ ఇచ్చిన ఈ దీటైన జవాబును భారత్ అంత తేలిగ్గా మర్చిపోలేదని" ఆయన అన్నారు.

భారత దాడుల్లో 26 మంది పాకిస్థాన్ పౌరులు దుర్మరణం పాలయ్యారని, వారిలో ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నాడని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఆ చిన్నారి అంత్యక్రియలకు హాజరయ్యానని చెబుతూ.. అమాయకంగా ప్రాణాలు కోల్పోయిన వారందరికీ తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ సంఖ్యలను తర్వాత నిర్ధారించారు. భారత దాడుల్లో 31 మంది సామాన్య పౌరులు చనిపోయారని, 71 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ దాడుల్లో పౌర నివాస ప్రాంతాలే లక్ష్యంగా చేసుకున్నారని చౌదరి పేర్కొన్నారు.

పాకిస్థాన్ సాయుధ దళాల ధైర్యసాహసాలను, వారి వృత్తి నైపుణ్యాన్ని షరీఫ్ ఎంతగానో ప్రశంసించారు. ముఖ్యంగా నియంత్రణ రేఖ (LoC) వెంబడి దేశాన్ని రక్షిస్తున్న సైనికులను ఆయన కొనియాడారు. సైనిక నాయకులను అభినందిస్తూ.. సాయుధ దళాల ధైర్యానికి, తక్షణ స్పందనకు యావత్ పాకిస్థాన్ జాతి గర్విస్తోందని అన్నారు.

భారత ఆక్రమిత కశ్మీర్‌లోని (IIOJK) పహల్గామ్‌ సంఘటన వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని షరీఫ్ కొట్టిపారేశారు. ఈ ఘటనపై విచారణకు సహకరిస్తామని పాకిస్తాన్ ఎప్పుడో ప్రతిపాదించినా, భారత్ దాన్ని పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు.

చివరగా షరీఫ్ భారత్‌కు మరోసారి స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. "ఈ దురాక్రమణకు భారత్ తప్పక మూల్యం చెల్లించుకుంటుంది. మేము మా బలగాలకు సెల్యూట్ చేస్తున్నాం.. ఒకే జాతిగా, ఒకేతాటిపై నిలబడతాం." అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: