
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి పాలైన తర్వాత, పార్టీ నేతల్లో విభేదాలు పెరిగిపోతున్నాయని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు కల్వకుంట్ల కవిత తాజా రాజకీయ అడుగులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి. జాగృతి అనే సంస్థ పేరుతో తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న కవిత, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి దూరంగా కనిపిస్తోంది. తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌లకు పూర్తిగా అండగా ఉండాల్సిన సమయంలో, ఆమె వేరే దారి ఎంచుకోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. పార్టీ ఓటమి తర్వాత ఆత్మపరిశీలన జరుగాల్సిన తరుణంలో, పార్టీకి పునర్నిర్మాణం అవసరమైన దశలో, కవిత రాజకీయ వైఖరి పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.
కవిత ఆధ్వర్యంలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతల మద్దతు లేకపోవడం గమనార్హం. పార్టీ మధ్యస్థాయి కేడర్ నుంచి పెద్దగా స్పందన లేకపోవడం, ఆమె ఒంటరిగా ప్రయత్నాలు చేయడం చూస్తే ఆమెకు పార్టీతో ఉన్న బంధం మరింతగా బలహీనపడిందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమెకు ప్రస్తుతం బీఆర్ఎస్ లో రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. ఇటీవల ఆమె విడుదల చేసిన ఓపెన్ లెటర్ కూడా రాజకీయ వర్గాల నుంచి స్పందన లభించలేదు. ఆ లేఖ ద్వారా ప్రజల్లో మద్దతు ఉందన్న ప్రచారం చేసినా, వాస్తవానికి పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై పార్టీలోనే కొందరు నేతలు, ఇది విభేదాలకు తెరలేపే విధంగా ఉందే తప్ప, పార్టీ ఐక్యతకు తోడ్పడే విధంగా లేదని అభిప్రాయపడుతున్నారు. కవిత తిరిగి రాజకీయంగా వెలుగులోకి రావాలన్న ఆతృతలో ‘జాగృతి’ పేరిట కొత్త ప్రస్థానం మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ నుంచి విడిపోయే సంకేతమా? లేక వ్యక్తిగత రాజకీయ గుర్తింపుని మళ్లీ ఏర్పరచుకునే ప్రయత్నమా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. ఈ పరిణామాలు బీఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతున్న సంక్షోభాన్ని బయటపెడుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు