
ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ ఇంచార్జీల్లో కొంతమంది నేతలు తమ పరిధిలో సరైన పట్టు సాధించలేకపోతున్నారు. ఉదాహరణకు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో మైనార్టీ కోటాలో మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్‌కు అవకాశం ఇచ్చినా, ఆయన సక్సెస్ కాలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి కూడా పరిస్థితి ఇంతే. ఇప్పుడు ఆయనను కూడా మార్చి వెంకటగిరి రాజాలకు అవకాశం ఇస్తారని అంటున్నారు.
గత ఎన్నికల ముందు జరిగిన ఇంచార్జ్ మార్పులు కొన్నిచోట్ల పార్టీకి ప్రతికూలంగా మారాయి. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నేతలను మార్చడం వల్ల రెండు ప్రాంతాల్లోనూ పార్టీ పట్టు తగ్గింది. దీంతో ఇప్పుడు మళ్లీ పాత నేతలను తిరిగి వారి పాత నియోజకవర్గాలకు తిరిగి పంపించే ఆలోచనలో జగన్ ఉన్నారు. సుమారు 50 నియోజకవర్గాల్లో పాత ఇంచార్జీలే తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే సమయంలో, అభ్యర్థులు లేని నియోజకవర్గాల్లో కొత్త, యువ, చురుకైన నేతలకు అవకాశమిచ్చే ఆలోచన చేస్తున్నారు.
జిల్లాల స్థాయిలో ఉన్న ఇంచార్జీల పనితీరుపై కూడా పార్టీ లోపల చర్చ నడుస్తోంది. కొందరు ఇంచార్జీలు చురుకుగా వ్యవహరిస్తున్నా, మరికొందరు వెనుకబడి ఉన్నారని రిపోర్టులు వచ్చాయి. వీరిపై ఇప్పటికే జగన్ సమగ్ర సమీక్ష జరిపించారు. ఫలితంగా, పనితీరు తక్కువగా ఉన్నవారిని తొలగించి, యాక్టివ్‌గా పనిచేసే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు, జిల్లాల నేతలపై ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా జిల్లాల స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను క్రమం తప్పకుండా అధ్యయనం చేసి, అవసరమైనప్పుడు నేరుగా జోక్యం చేసుకుని నియంత్రణ చేపట్టే అవకాశం ఉంటుంది. ఏదేమైనా వైసీపీలో ఈ కొత్త మార్పులు పార్టీకి ఎంత వరకు ప్లస్ అవుతాయో ? చూడాలి.