ఆ చీకటి రోజుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న విజయవాడకు మరోసారి బిగ్ అలర్ట్ వచ్చేసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటం వల్ల వాగులు, వంకలు పొంగి పొరలిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా, కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా పనులు ఆపేశాయి. గుంటూరు–హైదరాబాద్ రహదారిపై రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కడప–బద్వేల్ మధ్య రహదారి దెబ్బతినడంతో రవాణా పూర్తిగా ఆగిపోయింది. రానున్న మూడు రోజుల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు మరింత ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కృష్ణా నది ..బుడమేరు పొంగి పొరలుతోంది. దగ్గరలోని ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ధ్యానచంద్ర హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.
అచ్చంపేట–మాదిపాడు రహదారిపై వరద నీరు చేరడంతో అమరావతి–విజయవాడ రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే విజయవాడ ప్రజల్లో భయం మొదలైంది. "మళ్లీ ఎక్కడ వరద ముంచుతుందో?" అని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. కొందరు ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు. మరో మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ కనకదుర్గమ్మ తల్లి చల్లని చూపు విజయవాడ పై ఉంటే ఏ వాగు ఏ వరద విజయవాడ జనాలని ఏం చేయలేవు అంటున్నారు కొందరు స్ధానికులు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి