
ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే ఒకరు మద్యం మత్తులో అనవసరంగా మాట్లాడటంతో అది రికార్డు అయి వైరల్ అయ్యింది. ఆ వీడియోను విపక్షం వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం వల్ల పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఇలాగే మరికొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత వ్యవహారాలు, అవినీతి ఆరోపణలతో ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ ఒకటి, రెండు అవకాశాలు ఉంటాయి. తప్పులు చేసినా దిద్దుకునే చాన్స్ ఇస్తారు. కానీ వార్నింగ్ ఇచ్చినా మార్పు రాకపోతే ఆయన చేతులు ఎత్తేస్తారు. అప్పుడు ఎంత ఒత్తిడి చేసినా, ఎంత లాబీయింగ్ చేసినా మరోసారి టికెట్ వచ్చే అవకాశం ఉండదు.
రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు అధికారాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే వారి భవిష్యత్ తొలి సారితోనే అంతమైపోతుందని స్పష్టం అవుతోంది. చంద్రబాబు హెచ్చరికలు విస్మరించిన వారికి ఇది మొదటి అవకాశం కాదే, చివరి అవకాశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకనైనా ప్రవర్తన మార్చుకోకపోతే.. ‘ఫస్ట్ టైమే, లాస్ట్ టైమ్’ అన్న నానుడి వారిపైనే సరిగ్గా అమలవుతుంది. ఈ మొత్తం వ్యవహారం టీడీపీకి పెద్ద పాఠమని, కొత్త ఎమ్మెల్యేలకు కఠిన శాసనమే మిగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.