విశాఖలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల విస్తృత స్థాయి పార్టీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బస, సభలు, సమావేశాలపై జనసేన శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఈ సందర్శనను తమకు అనుకూలంగా మలచుకోవాలని విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నోటి నుంచి “విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేట్ కాదు” అనే స్పష్టమైన ప్రకటన రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. . వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో పవన్ అనేక సార్లు విశాఖకు వచ్చి, “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అని గళం విప్పారు. 2021 డిసెంబర్‌లో ఆయన రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ క్యాంపెయిన్‌కి పిలుపునిస్తూ విశాఖ వేదికగా శ్రీకారం చుట్టారు.
 

ఆ రోజుల్లోనే వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో గళం వినిపించాలని ఆయన కోరారు. ఇప్పుడు తానే కూటమి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆ సమయంలో చెప్పిన మాటలే ఎందుకు అమలు చేయరని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్లాంట్‌లోని 32 కీలక విభాగాలను ప్రైవేట్ పరం చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో కార్మికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. మొత్తంగా కాకుండా కొద్దికొద్దిగా ప్రైవేట్ చేయడం వెనుక ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తక్షణమే అధికారిక ప్రకటన చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్, “విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేట్ కాదు” అని భరోసా ఇచ్చారు. వైసీపీ మాత్రం ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుందని విమర్శించారు. అయితే కార్మిక సంఘాలు “నాదెండ్ల భరోసా సరిపోదు … పవన్ కళ్యాణ్ మాటే మాకు ధైర్యం” అంటున్నాయి. మూడు రోజుల పాటు విశాఖలో పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండే పవన్, 30న జరిగే బహిరంగ సభలో విశాఖ ఉక్కుపై తప్పక స్పందిస్తారని ఆశగా కార్మిక లోకం ఎదురు చూస్తోంది. “ఉక్కు కర్మాగారం ఆంధ్రుల గర్వం – అది ప్రైవేట్ పరం కాదని పవన్ స్పష్టంగా చెప్పాల్సిందే” అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చే ఒక్క మాటే ఉద్యమానికి కొత్త ఊపిరి ఇస్తుందని, అందుకే ఉక్కు కార్మికులు, ప్రజా సంఘాలు వేయి కళ్ళతో పవన్ రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: