
జగన్, భారతి, సమీప బంధువులు అందరూ కింద కూర్చుంటే… విజయమ్మ మాత్రం ప్రత్యేకంగా కుర్చీపై కూర్చుని భర్తకు నివాళి అర్పించారు. అనంతరం తన కుమారుడికి ఆశీర్వాదాలు అందించారు. కానీ అసలు ఆసక్తికర దృశ్యం తర్వాత జరిగింది. జగన్ వెళ్లిన కొద్దిసేపటికే షర్మిల తన పిల్లలతో కలిసి తండ్రికి నివాళులు అర్పించేందుకు సమాధి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో విజయమ్మ కూడా అక్కడే ఉన్నా, ఆమె కూర్చున్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. జగన్ నివాళి సమయంలో ముందువరుసలో కుర్చీ మీద కనిపించిన విజయమ్మ… షర్మిల నివాళి సమయంలో మాత్రం వెనుక వరుసలో చాలా దిగాలుగా కూర్చుని కనిపించారు. దీంతో విజయమ్మ నిజంగానే షర్మిల జట్టు వీడి జగన్ జట్టులో చేరిపోయారా? అన్న చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఎందుకంటే గతంలో షర్మిల వెంట ఇడుపులపాయకు వచ్చిన విజయమ్మ, జగన్ తో ఎక్కడా కనిపించలేదు.
అంతేకాదు, కంపెనీ షేర్ల పంచాయతీ విషయంలో షర్మిలతో కలిసి కోర్టులో జగన్‌పై బహిరంగంగా నిలబడ్డారు. ఆ సమయంలో జగన్ అండ్ కోపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ తాజాగా కోర్టు తీర్పు జగన్‌కు అనుకూలంగా రావడంతో పరిస్థితులు మారిపోయినట్లు కనిపిస్తోంది. మంగళవారం ఇడుపులపాయలో విజయమ్మ కుమారుడితో కలిసి ఒకవైపు, కుమార్తెతో మరోవైపు ఉన్నా… షర్మిలకు దూరంగా కూర్చోవడం వెనుక రాజకీయ సిగ్నల్ ఉందా? అన్న చర్చలు గట్టిగానే నడుస్తున్నాయి. ఇక ఆ దృశ్యాలు బయటకు రావడంతో, జగన్ అనుచరులు “విజయమ్మ గారు మళ్లీ కుటుంబం కలిసేలా ముందడుగు వేసారు” అని ఆనందిస్తుండగా, షర్మిల అనుచరులు మాత్రం “అమ్మను కూడా జగన్ వైపు తిప్పుకున్నాడు” అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వైఎస్ వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కుటుంబ రాజకీయ దృశ్యం, ఏపీ రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన చర్చలకు తావు ఇచ్చింది.