
దాదాపు ఆరు గంటలపాటు సాగిన రోడ్‌షో లో జన సమూహం తరలి రావడంతో వైసీపీ కేడర్ లో జోష్ పెరిగింది. మూడు నెలల తర్వాత జగన్ నేరుగా జనాల్లోకి రావడం, ప్రజలతో మమేకం కావడం పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. లండన్ బయలుదేరే ముందు జగన్ పార్టీ నేతలతో పలు కీలక సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. పార్టీని జనంలో ఉంచే విధంగా పని చేయాలని, మెడికల్ కాలేజీలు, పీపీపీ ప్రాజెక్టులు, ప్రజా కార్యక్రమాలు వంటి అంశాల్లో యాక్టివిటీని పెంచాలని ఆయన ఆదేశించారు. ప్రజల మధ్య వైసీపీ మళ్లీ బలంగా వినిపించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అంతేకాక, పార్టీ భవిష్యత్ దిశపై యాభై రోజుల షెడ్యూల్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మాజీ మంత్రి కొడాలి నాని మరియు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల జగన్‌ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరికీ పార్టీలో మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొడాలి నాని ఆపరేషన్ కారణంగా, వంశీ జైలు అనుభవం కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ పార్టీ యాక్టివిటీల్లోకి రావాలని జగన్‌కు చెప్పడంతో, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తం మీద, ఈసారి జగన్ లండన్ టూర్ ఫ్యామిలీ ట్రిప్ మాత్రమే కాదు – రాజకీయంగా కూడా రిచార్జ్ ప్యాకేజీ లాంటిదే. తిరిగి వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాలను మరింత దూకుడుగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని వర్గాలు చెబుతున్నాయి. ఇక నుండి తాను పూర్తిగా జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు.