
కానీ, రాజకీయాల్లో స్ట్రాటజీతో పాటు బలమైన సామాజికవర్గం, మద్దతు, కేడర్ అనేవి అవసరం. పీకే తన స్వీయ పార్టీ “జన్ సురాజ్” తో బీహార్ లో పాదయాత్ర చేసి, వేలమందిని కలసి, పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఆయన లక్ష్యం బీహార్ ను మార్చాలనే పెద్ద డ్రీమ్. కానీ ప్రజాదరణతో మాత్రమే రాజకీయాలు నడవవు… దానికి బ్యాక్‌లో ఓటు బ్యాంక్ ఉండాలి. ప్రస్తుతం బీహార్ రాజకీయాలు రెండు పెద్ద కూటముల మధ్య కుదురుకున్నాయి - నితీష్ కుమార్ - లాలూ యాదవ్ కూటమి ఒకవైపు, బీజేపీ మరోవైపు. సామాజికవర్గాలు కూడా ఈ రెండు వైపులకే విడిపోయాయి. పీకేకు ఏ ఒక్క బలమైన సామాజిక వర్గం గట్టి మద్దతుగా లేదు. ఈ లోటు వల్ల ఆయన పార్టీకి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. తాను పోటీ చేసి ఓడిపోతే తన ప్రభావం ఏమీ లేదని తేలిపోతుంది. అందుకే రిస్క్ తీసుకోకుండా వెనక్కి తగ్గారు.
ఇంకో కోణంలో చూస్తే - పీకే ప్లాన్ కింగ్ మేకర్ అవ్వడమే. ఎవరు గెలిచినా తన సపోర్ట్ అవసరం అయ్యేలా స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. పార్టీ అభ్యర్థుల కోసం తాను రాష్ట్రమంతా తిరిగి కాంపెయిన్ చేస్తానని పీకే ప్రకటించారు. అంటే నాయకుడిగా కాకుండా ప్రభావశీలుడిగా ఉండే గేమ్ ఆడుతున్నారన్నమాట. కానీ బీహార్ రాజకీయాల్లో ఇది వర్క్ అవుతుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పీకేకు ప్రజాదరణ ఉన్నా, పట్టు లేని ఓటు బ్యాంక్ లోటు ఉంది. బలమైన నియోజకవర్గం సొంతం చేసుకోకపోవడం, కూటములు కట్టకపోవడం ఆయనకు పెద్ద మైనస్ అయింది. ఒకవైపు బీజేపీ, మరోవైపు ఆర్జేడీ-జేడీయూ కలయికల మధ్యలో పీకేకు పెద్ద స్పేస్ లేదు. అందుకే ఆయన ఎన్నికల నుంచి దూరంగా ఉండటం ఒక స్ట్రాటజిక్ రిట్రీట్ అని చెప్పొచ్చు. కానీ ఇది ఆయనకు రాజకీయ లాభమా, లేక గేమ్ ఓవర్ సిగ్నలా అనేది రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.