ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ముఖ్యంగా టీచర్ ఉద్యోగాల కోసం ఎంతోమంది వేచి చూస్తున్న తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీ పై పెట్టింది. మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటనను ఏప్రిల్ 20న విడుదల చేసింది. దీనికి మూడు లక్షల 36వేల మంది అభ్యర్థులు  దరఖాస్తులను సమర్పించారు. ఈ డీఎస్సీకి జూన్ 6 నుంచి జూలై 2 వరకు విడతల వారీగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు కూడా అందించారు. అలా మొదటి సంతకం డీఎస్సీ పై పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో మెగా డీఎస్సీ కూడా వేయడానికి సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే మరో మెగా డీఎస్సీని  విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు టెట్ పరీక్ష నిర్వహణపై కూడా చర్యలు తీసుకోబోతున్నారు. అయితే గతంలో ఈ డీఎస్సీ పై పలు న్యాయ వివాదాలు ఏర్పడ్డాయి.

కానీ ఈసారి విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి న్యాయవివాదాలకు తావు లేకుండా చర్యలు చేపడతామని అధికారులు అంటున్నారు. అయితే ఈసారి టెట్  అర్హత విషయంలో పూర్తిగా ఉపాధ్యాయ, విద్యా జాతీయ మండలి నిబంధనలను పాటించాలని  నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల యొక్క అర్హతలు, డిగ్రీ మార్కులు, ఇతర అంశాలు పూర్తిగా ఎన్ సీటీఈ  నిబంధనలే కీలకమన్నారు. అయితే గత కొంతకాలం నుంచి టెట్ లో ఒకే తరహా నిబంధనలు ఉండడంవల్ల ప్రతిసారి న్యాయ వివాదాలు ఏర్పడుతున్నాయి. ఈసారి వాటికి తావు లేకుండా ఎన్సీటీఈ తరహాలోకి మార్చి న్యాయవివాదాలు లేకుండా చూడాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈసారి ప్రకటించే డీఎస్సీలో 2000 పోస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా స్పెషల్ డిఎస్సీ పోస్టులు 1000, మెగా డీఎస్సీ -2025 వ సంవత్సరానికి గానూ మిగిలిన పోస్టులు 406.. అంతేకాకుండా ఇదే ఏడాది ఉపాధ్యాయుల పదవి విరమణతో ఏర్పడే ఖాళీలను  కూడా కలుపుకొని డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఖాళీలు ఎక్కువగా ఏర్పడితే మాత్రం విద్యార్థుల సంఖ్యను బట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రకటన ఎప్పుడైతే లోకేష్  నోటి నుంచి బయటకు వచ్చిందో అప్పటినుండి నిరుద్యోగులంతా సంబరపడిపోతూ డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: