
ఈ నేపథ్యంలో, సునీత మాగంటికి చట్టబద్ధమైన భార్య కాదని, వారు కేవలం 'లీవ్ ఇన్ రిలేషన్‌లో' ఉన్నారని ప్రద్యుమ్న తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ సంచలన ఆరోపణలతో సునీత నామినేషన్ రద్దు అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఊహించిన పరిణామాలకు బీఆర్‌ఎస్ అధిష్ఠానం ముందుగానే అప్రమత్తమైంది. అందుకే, మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డితో 'బ్యాకప్' నామినేషన్ దాఖలు చేయించింది. ఈసీ కీలక నిర్ణయం: సునీత నామినేషన్‌కు గ్రీన్ సిగ్నల్! .. ప్రద్యుమ్న చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారులు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాగంటి గోపీనాథ్‌కు సునీత రెండో భార్యనా, కాదా అనే విషయాన్ని తాము తేల్చాల్సిన బాధ్యత కాదని ఈసీ స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం కోర్టు పరిధిలో తేల్చుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఈ నిర్ణయంతో మాగంటి సునీత నామినేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. అయితే, మరింత సమాచారంతో డిక్లరేషన్ దాఖలు చేయాలని ఈసీ ఆమెకు సూచించింది. నామినేషన్ ఆమోదం పొందడంతో, ఉపసంహరణ సమయంలో విష్ణు వర్ధన్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు. మరోవైపు, ఈ ఎన్నికను బీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రేపు (గురువారం) పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ నేతలతో సమావేశమై, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అమలు చేయాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. సునీత నామినేషన్‌పై వచ్చిన ఈ సంచలన ఆరోపణలు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి.